ఫిరాయింపులపై ఏం చర్యలు తీసుకున్నారు?
స్పీకర్ కార్యాలయంలో వివరాలు తెలుసుకోండి
ఏజీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తీసుకునే చర్యల గురించి వివరాలు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు విధించింది. వచ్చే సోమవారంలోపు శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి తగిన సూచనలను పొందాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారారు. వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కూన వివేకానంద వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి బుధవారం విచారించి తాజా ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు.






