అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
ఆ కలల సాకారం దిశగా సర్కార్ అడుగులు
ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ జయంతి సభలో డాక్టర్ కవ్వంపల్లి
మానకొండూరు,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గం అందరికీ అనుసరణీయమని,ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపు నిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయాలను ఆచరించి సాకారం చేసినప్పుడే ఆ మహ నీయునికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు.రాష్ట్రంలో ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగు తున్న ప్రజా ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసే దిశగా పని చేస్తున్నదని ఆయన చెప్పారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా సౌకర్యాలు, భూమి పంపిణీ ఇవన్నీ అంబేద్కర్ కలల సాకారానికేనని చెప్పారు. తాను కూడా మానకొండూర్ నియోజకవర్గంలో ఎస్సీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు.
టీపీసీసీ ఎస్సీ సెల్ ద్వారా ప్రతి దళిత యువకుడికి, యువతికి విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వివరించారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇక్కడ నిలబడి ఉండటం నా జీవితంలో గర్వించదగ్గ క్షణమని కవ్వంపల్లి పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా, టీపీసీసీ ఎస్సి సెల్ అధ్యక్షుడిగా ఈ వేదికపై మాట్లాడుతున్నం దుకు ఆనందంగా ఉందన్నారు. ఎప్పుడూ తన కోసం కాకుండా దళితులు,వెనుకబడిన వర్గాల కోసం అహరహం పని చేయడమే కాకుండా తన జీవితాన్ని అణగారిన వర్గాల కోసం ధారపోసారని ఆయన పేర్కొన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీలమైన రాజ్యాంగంగా గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు. కులాలు, మతాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి నొక్కి చెప్పారు. ప్రతి దళిత బిడ్డ చదువుకొని, ఉద్యోగం చేసి, నాయకుడవ్వాలని, అందుకే ఈ జయంతి కేవలం జ్ఞాపకంగా కాకుండా, ప్రతిజ్ఞగా మారాలన్నారు. ఇంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి , మంత్రులు,ఎమ్మెల్యేలతో కలిసి డాక్టర్ సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు.






