8 March, 2026 | 3:39 AM

నెట్ మీటర్ల కొరత

08-03-2026 12:46 AM

తెలంగాణలో సోలార్ ప్లాంట్లకు బ్రేక్

వినియోగదారులపై ఆర్థిక భారం

మీటర్ల ఏర్పాటుపై లంచాల ఆరోపణలు

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): వేసవి ఎండలు మండుతున్న వేళ తెలంగాణలో సౌర విద్యుత్ ఉత్పత్తికి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ, నెట్ మీటర్ల కొరత కారణంగా వేలాది సోలార్ ప్లాంట్లు పనిచేయకుండా నిలిచిపోయాయి. రూ.లక్షల పెట్టుబడి పెట్టి ఇళ్లు, వ్యాపార సంస్థలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసిన వినియోగదారులు ప్రస్తుతం తీవ్ర నిరాశకు గురవు తున్నారు. డిసెంబర్ నుంచి  100 రోజులుగా కొనసాగుతున్న నెట్ మీటర్ల కొరత కారణంగా సిద్ధంగా ఉన్న అనేక రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లు విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానం కావడం లేదు.

దీంతో ఈ ప్లాంట్లు ప్రస్తుతం అలంకరణలుగా మారిపోయాయి. వాస్తవానికి సోలార్ వ్యవస్థలో నెట్ మీటర్ కీలక పాత్ర పోషిస్తుంది. వినియోగదారు ఉపయోగించే విద్యుత్, గ్రిడ్‌కు పంపే అదనపు విద్యుత్‌ను ఇది నమోదు చేస్తుంది. ఈ మీటర్ లేకుండా సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఈ సమస్యనుసోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధికారులు టీజీఎస్పీడీసీఎల్ ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని అనేక డివిజన్లలో నెట్ మీటర్లు అందుబాటులో లేవని వారు తెలిపారు.

నిలిచిన వేలాది సోలార్ ప్లాంట్లు 

నివాస, వాణిజ్య, పరిశ్రమల రంగాల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు పెరుగుతున్నప్పటికీ, నెట్ మీటర్ల లభ్యత లేకపోవడంతో అనేక కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వినియోగదారుల వద్ద ప్లాంట్లు పూర్తిగా ఏర్పాటు చేసినప్పటికీ గ్రిడ్‌తో అనుసంధానం చేయలేక అవి నిలిచిపోయాయి.

వినియోగదారులకు ఆర్థిక భారంగా మారింది. 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసేం దుకు చాలామంది బ్యాంకు రుణాలు తీసుకున్నారు.  ప్రస్తుతం విద్యుత్ బిల్లుల్లో తగ్గిం పు లేకుండా నెలవారీ ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది. ఇంకొకవైపు రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతోంది. స్థానికంగా ఉత్పత్తి అయ్యే తక్కువ ధర సౌర విద్యుత్ వినియోగం లేకుండా ఉండగా, రాష్ట్రం బయట నుంచి యూనిట్‌కు రూ. 5 నుంచి రూ. 10 వరకు ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది.

లంచాల ఆరోపణలు 

అధికారికంగా నెట్ మీటర్లు లేవని చెబుతున్నప్పటికీ, కొంతమంది మధ్యవర్తుల ద్వారా రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ‘సర్వీస్ చార్జీలు’ లేదా లంచాలు చెల్లి స్తే మీటర్లు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై అసోసియేషన్ ప్రతినిధులు టీజీఎస్పీడీసీఎల్ కొత్త సీఎండీ జితేష్ పాటిల్‌ను కలుసుకుని వెంటనే నెట్ మీటర్ల కొనుగోలు, సరఫరా వేగవంతం చేయాలని కోరారు. సమావేశం అనంతరం సీఎండీ త్వరలోనే మీటర్ల కొరత సమస్యను పరిష్కరిస్తామని, ఫీల్డ్ స్థాయిలో సరఫరా అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు.

నెట్ మీటర్ల కొరత కారణంగా పీఎం సూర్య ఘర్ యోజనకు అవరోధం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్య ఘర్ యోజన కింద తెలంగాణలో సోలార్ వ్యవస్థల విస్తరణ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నెట్ మీటర్ల కొరత కొనసాగితే ఈ లక్ష్యాలు సాధించడం కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. సీఎండీ ఇచ్చిన హామీ అమలైతే, త్వరలోనే వేలాది ఇళ్లలో సోలార్ వ్యవస్థలు ప్రారంభమై విద్యుత్ గ్రిడ్‌కు ఉపశమనం కలిగించే అవకాశముంది.

ఈ ప్రభావంతో ఎదురయ్యే నాలుగు ప్రధాన సమస్యలు..

*సోలార్ కంపెనీలు, వినియోగదారులకు తక్షణ ఆర్థిక నష్టం

*రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాల సాధనలో ఆలస్యం

*సోలార్ వ్యవస్థలపై వినియోగదారుల నమ్మకం తగ్గడం

*సిద్ధంగా ఉన్న సోలార్ ప్లాంట్లు పనిలేక నిలిచిపోవడం