16 June, 2026 | 7:49 PM

12 ఏళ్ల మోడీ పాలన దేశ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చింది

16-06-2026 07:10 PM

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. జాంగీర్

చౌటుప్పల్,(విజయక్రాంతి): కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. జాంగీర్ విమర్శించారు. ఈ సందర్భంగా ఎం.డి జాంగిర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాకపోగా, నిరుద్యోగం మరింత పెరిగిందన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని పేర్కొన్నారు.వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ దేశ సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరిస్తోందని ఆరోపించారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధానాలను బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసం వామపక్ష శక్తులు,ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.