2 August, 2026 | 1:20 AM

అపర సంజీవని తల్లిపాలు

02-08-2026 12:00 AM

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా.. :

తల్లి తనువులోని అనువణువు అర్పించి, నెత్తుటి చుక్కలని క్షీరామృతంగా మార్చి బిడ్డకు జీవంపోస్తుంది. శిశువుల ఆరోగ్యంలో తల్లిపాల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అందుకే బిడ్డ పోషణ, ఆరోగ్యం తదితర విషయాల్లో తల్లికి అవగాహన కల్పిస్తూ, ఆ దిశగా కాబోయే తల్లిని ప్రోత్సహించడం మనందరి బాధ్యత.

బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు తాగించడం, మొదటి ఆరునెలల వయస్సు వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, ఆరునెలల తర్వాత అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు రెండేళ్ల వరకు లేదా వీలైనంత ఎక్కువ కాలం ఇవ్వడం వంటి లక్ష్యాలతో ఆగస్టు 1992 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ సహకారంతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జరుపుకొంటున్నాయి.

వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమశాఖ, స్వచ్ఛంద సంస్థలు దీనిపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాయి. తల్లిపాలు ఇవ్వకపోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. మన దేశంలో జరిపిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం తల్లిపాలు అందని కారణంగా ఏటా నీళ్ల విరేచనాలు, న్యుమోనియాతో దాదాపు లక్ష మంది 5 ఏళ్లలోపు పిల్లలు చనిపోతున్నారు. ఏటా 3 కోట్ల మంది పిల్లలు నీళ్ల విరేచనాలకు, 24 లక్షల మంది చిన్నారులు న్యుమోనియా జబ్బులకు, 40,382 మంది పిల్లలు స్థూలకాయానికి లోనవుతున్నారు.

అదేవిదంగా ఏటా సుమారు 7000 మంది తల్లులు రొమ్ము క్యాన్సర్, 1700 మంది తల్లులు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. కొంతమంది తల్లులకు అమ్మపాల ప్రాముఖ్యతపై సరియైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం 41.8 శాతం తల్లులు మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు ప్రారంభిస్తున్నారు. 45.9 శాతం పిల్లలకు మాత్రమే 6 నెలల వయస్సులో అదనపు ఆహారం ఇస్తున్నారు.

తల్లిపాలివ్వడం అనేది తల్లీబిడ్డల ఇద్దరి హక్కు. గంటలోపు తల్లి ఇచ్చే ముర్రుపాలే బిడ్డకి తొలి మురిపాలు. ప్రసవం తర్వాత బిడ్డను తల్లి వద్దకు తీసుకురాగానే గంటలోపు తల్లి పాలను తాగించాలి. అప్పుడే పుట్టిన శిశువుకు 12 గంటల నిద్ర అవసరం. పుట్టిన గంటలోపు బిడ్డ నిద్రలోకి జారుకోకముందే పాలు తాగించాలి. ఒకవేళ సీజేరియన్ కాన్పు అయితే తల్లి స్పృహలోకి వచ్చిన వెంటనే బిడ్డకి పాలు పట్టించాలి. కాన్పు అయిన మొదటి రెండు మూడు రోజులు తల్లిపాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయి.

వీటిని ముర్రుపాలు లేదా కొలాస్ట్రం అంటారు. దీనిలో బిడ్డ రక్షణకు అవసరమయ్యే రోగనిరోధక శక్తి ఉండటం వల్ల ఇది ఒక వ్యాక్సిన్‌లాగా ఉపయోగపడుతుంది. వీటిలో విటమిన్ ‘ఎ, బి, కె’లతో పాటు ప్రోటీన్లు, ఐరన్ కూడా ఉంటుంది. ఇది అమృతంతో సమానం. బిడ్డకు తల్లిపాలు మాత్రమే సంపూర్ణ పౌష్టికాహారం. తల్లిపాలలో 90 శాతం నీరు ఉంటుంది.

తల్లి పాలు కాకుండా పోతపాలు, చక్కెర నీళ్లు, తేనె, గ్లూకోజ్ నీళ్లు వంటివి తాగించడం వల్ల కలుషితమై విరేచనాలు, వాంతులు, దగ్గు, జలుబు, న్యూమోనియా, కామెర్లు మొదలైన వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. పుట్టినప్పటి నుంచి ఆరునెలల వరకు తల్లి పాలు బిడ్డ బాగా పెరగడానికి, ఆరోగ్యంగా ఉండాటానికి అత్యంత పుష్టికరమైన, సురక్షితమైన, సహజ సిద్ధమైన సంపూర్ణ ద్రవ ఆహారం. తల్లిపాలు బిడ్డకు తొలి వ్యాధి నిరోధక టీకాలాగా పనిచేస్తుంది.

అవి తేలికగా అరుగుతాయి. శుభ్రమైనవి, సురక్షితమైనవి కూడా. తల్లిపాలు పిల్లల్ని శ్వాసకోశ వ్యాధులు (న్యూమోనియా), అలర్జీలు, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి రక్షిస్తాయి. తల్లిపాలు తాగే బిడ్డల దవడలు బాగా బలపడతాయి. ఎక్కువ తెలివితేటలు, చురుకుదనం కలిగి ఉంటారు.

బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషణ ఇస్తాయి. బాల్యంలో వచ్చే ఇన్ఫెక్షన్‌లే కాదు, భవిష్యత్‌లో బీపీ, మధుమేహం కూడా దూరంగా ఉంటాయి. తల్లిపాలు బిడ్డకు పట్టించడం వల్ల 13 శాతం శిశు మరణాలు తగ్గించవచ్చు. అంతేకాదు, బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లి కూడా ఆరోగ్యం ఉంటుందన్న సత్యాన్ని అందరూ గ్రహించాలి.

నాశబోయిన నరసింహ 

వ్యాసకర్త: కవి, రచయిత, 

ఆరోగ్య విస్తరణాధికారి, 8555010108