స్పెయిన్‌కు వలసలు
మొరాకో నుంచి స్పెయిన్‌కు ఒక్కసారిగా వేలాది మంది అక్రమంగా వలసరావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో యూరప్ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఒక్కసారిగా వేలాది మంది దూసుకురావడంతో ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు స్పెయిన్‌తో సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సెయుటా తీరంలో భారీగా భద్రతా బలగాలను మోహరించిన స్పెయిన్ ఈ ఆకస్మిక వలసలను నిలువరించినట్టు తెలుస్తున్నది.
సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చిన సుమారు 60 మంది మరణించడం విషాదకరం. కాగా, సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చిన వలసదారులను తక్షణమే వెనక్కి పంపించవద్దని స్పెయిన్ న్యాయస్థానం వెలువరించిన ఓ తీర్పు భారీ సంఖ్యలో మొరాకో వాసులు యూరప్ వైపు కదలడానికి ఉసిగొల్పినట్టు విశ్లేషణలు వినవస్తున్నాయి. అదే సమయంలో మొరాకో రాజు వందలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించగా, వారంతా స్పెయిన్ బాటపట్టారన్న ప్రచారమూ జరుగుతున్నది.
అయితే, ఈ ఆకస్మిక వలసలకు ఈ అంశాలే ప్రధాన కారణమని చెప్పడం పొరపాటే అవుతుంది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో నెలకొన్న పరిస్థితులు కూడా ఈ వలసలకు ఆజ్యం పోశాయని చెప్పక తప్పదు. మొరాకో రాజ్యాంగబద్ధమైన ఒక రాచరిక దేశం. ఆ దేశంలో పార్లమెంట్, ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పటికీ శాంతిభద్రతలు, సైన్యం సహా పలు అంశాలపై రాజకుటుంబానికి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి.
అంతేకాకుండా అవినీతి, అసమానతలు, జీవనవ్యయం పెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా పెరిగింది. మరోవైపు విద్య, వైద్యం వంటి కనీస మౌలిక వసతులను విస్మరించిన మొరాకో సర్కార్ రాబోయే ఫిఫా ప్రపంచకప్ కోసం కోట్ల రూపాయలను మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేస్తుండటంపై యువతలో నెలకొన్న అసహనం నిరుడు జెన్ జీ నిరసనల రూపంలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న యువత యూరప్ దేశాలకు పోటెత్తుతున్నారు.
ఉత్తర ఆఫ్రికాకు సెయుటా అతిసమీపంలో ఉండటం, యూరప్‌కు ఇది ముఖద్వారం కావడం వంటి అంశాలూ ఈ వలసలకు దారితీశాయి. అయితే సరిహద్దుల వద్ద కంచెలు, భద్రతా బలగాలతో మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. యూరప్ వైపు సరిహద్దుల పరిరక్షణతోపాటు మొరాకోలో ఉపాధి, విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపరచడమే ఈ సమస్యకు అంతిమ పరిష్కారం.






