20-02-2026 12:21:01 AM
ఎనిమిది మంది విద్యుత్ ఇంజినీర్లపై వేటు
హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విద్యుత్ శాఖలో వేళ్లూనుకున్న అవినీతిని అరికట్టే క్రమంలో గురువారం ఏకకాలంలో ఎనిమిది మంది ఇంజినీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
సస్పెన్షన్‌కు గురైన వారిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, సబ్ ఇంజినీర్లు ఉన్నారు. కొత్త కనెక్షన్ల మంజూరు నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వరకు ప్రతి పనికి లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది.
డిజిటల్ లంచాలు.. పక్కా ఆధారాలు
ఈ భారీ అవినీతి వ్యవహారం యాంటీ బ్రైబరీ సెల్‌కు వచ్చిన ఫిర్యాదుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం రహస్యంగా లోతుగా విచారణ జరపగా, విద్యుత్ అధికారులు అవినీతికి పాల్పడుతున్న తీరు విస్తుపోయేలా బయటపడింది. ముఖ్యంగా కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, ప్యానల్ బోర్డుల ఏర్పాటు అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరుకు వీరు ప్రజలను పీడించినట్లు తేలింది. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, నిందితులు లంచాలను నేరుగా తీసుకోకుండా ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా స్వీకరించినట్లు విచారణలో పక్కా సాంకేతిక ఆధారాలు లభించాయి.
ఇంటెలిజెన్స్ నివేదికతో దొరికిపోయిన కేటుగాళ్లు
సాధారణంగా లంచం తీసుకుంటే పట్టుబడతామనే భయంతో డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్న అధికారుల ఎత్తుగడ చివరకు వారినే చిక్కుల్లో పడేసింది. ఫోన్‌పే లావాదేవీల డేటా ఆధారంగా ఇంటెలిజెన్స్ అధికా రులు ఈ అక్రమాలను నిరూపించారు. బాధ్యులైన అధికారుల జాబితాను ఉన్నతాధికారులకు పంపగా తక్షణమే వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యుత్ కనెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సామాన్యులు, బిల్డర్లను ఇబ్బందులకు గురిచేసి డబ్బులు గుంజుతున్నట్లు విచారణలో స్పష్టమైంది.
ప్రక్షాళన దిశగా విద్యుత్ శాఖ..
ప్రభుత్వ సేవలను సామాన్యులకు అందించడంలో నిర్లక్ష్యం వహించినా లేదా అక్రమాలకు పాల్పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. విద్యుత్ శాఖ లో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఇంటెలిజెన్స్ విభా గం నిరంతరం నిఘా ఉంచుతుందని స్పష్టం చేసింది. ఈ ఎనిమిది మంది పై సస్పెన్షన్ వేటు పడటంతో ఇతర అవినీతి అధికారుల్లో వణుకు మొదలైంది. మరిన్ని ఫిర్యాదులపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మరికొంతమంది అక్రమా ర్కులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.