31 July, 2026 | 8:55 AM

భూవివాదంలో ఇద్దరు రిమాండ్

31-07-2026 08:01 AM

నర్సాపూర్,:మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాగులపల్లి గ్రామానికి చెందిన కోర్పోల్ శంకరయ్య కు బంధువులైన కోర్పోల్ గంగాధర్, కోర్పోల్ గోపాల్‌లతో వారసత్వ వ్యవసాయ భూమి వివాదం కొనసాగుతోంది.ఈనెల 28న రాత్రి నిందితులు శంకరయ్య ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేయగా, బాధితుడు ప్రతి ఘటించడంతో దవడ భాగంలో గాయమైంది.

కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నర్సాపూర్ పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రంజిత్ కుమార్ హెచ్చరించారు.