31 July, 2026 | 10:10 AM

గోదావరి ఉధృతం.. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

31-07-2026 09:36 AM
  1. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్ తాకుతూ ప్రవాహాం.
  2. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. 
  3. మేడిగడ్డ బ్యారేజ్ 85గేట్ల ఎత్తివేత.
  4. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

కాళేశ్వరం/ మహాదేవపూర్,జులై 31,(విజయక్రాంతి): మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి నది(Godavari river) ఉదృతంగా ప్రవహిస్తుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్ర లో భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగుతున్నది. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్ పై నీటిప్రవాహం క్రమేపి పెరుగుతుంది. శుక్రవారం ఉదయం వరకు కాళేశ్వరం 11.290మీటర్లు ప్రవాహాంతో మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో  గోదావరి ప్రవాహాం పెరుగుతోంది. ఎగువన కడెం ప్రాజెక్టు లోకి వరద నీరు చేరడం తో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లను దిగువకు విడుదల చేశారు.భారీ వర్షాలకారణంగా వరదలు చేరడంతో ఎల్లంపల్లి నిండు కుండలా తలపిస్తుంది.

అధికారులు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత ఉబయ నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ లోకి 8లక్షల 35వేల800  క్యూసెక్కుల వరద నీరు చేరడంతో  బ్యారేజ్ 85గేట్లు ఎత్తి ఉండడం వల్ల దిగువన అదే లెవల్లో నీరు వెళ్ళుతుంది. దిగువన వున్న పరివాహక ప్రాంతాలకు వరద నీరు ఏ సమయంలో నైనా నీటి ప్రవాహాం వచ్చే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి ప్రాంతాలల్లో చేపలు పట్టేవారు కానీ పశువులను గొర్రెలను అటు వైపు వెళ్ళవద్దని. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.