31 July, 2026 | 9:05 AM

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల కేసీఆర్ సంతాపం

31-07-2026 08:31 AM

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే(Narsampet Former MLA) బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy) మృతి పట్ల పార్టీ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్(KCR) స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించుకోవడానికి బీఆర్ఎస్ చేసిన విశ్వప్రయత్నాలూ, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొనసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని కేసీఆర్ కొనియాడారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని(Warangal District) నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది, అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని కేసీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ(BRS Party) పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడం పార్టీకి తీరని లోటని కేసీఆర్ సూచించారు. పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటాయని తెలిపారు. పెద్ది సుదర్శన్ కోల్పోయి శోక తప్త హృదయులై ఉన్న భార్యాపిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని అధినేత కేసీఆర్ భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో వారికి ధైర్యంగా అండగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులకు, కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.