20-02-2026 12:20:53 AM
కడియం న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్
బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు
కూతురుకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకుని ప్రచారం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో విచారణ చేపట్టారు. ఈ విచారణకు కడియం శ్రీహరి తరఫున న్యాయవాదులు, శ్రీహరిపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. కడియం శ్రీహరి పార్టీ మారినట్లుగా ఆధారాలేంటి..? అని ఆయన న్యాయవాదులు ఎమ్మెల్యే వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకుని ప్రచారం చేశారని ఎమ్మెల్యే వివేకా తెలిపారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ సభలకు కూడా హాజరయ్యారని ఆధారాలను స్పీకర్‌కు ఇచ్చారు. స్పీకర్ ఇరు పక్షాల వాదనలను నోటు చేసుకున్నారు. కడియం శ్రీహరి విషయంలో తీర్పు ఎప్పుడు, ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది.
కేసీఆర్ కాళ్లు పట్టుకుంటే శ్రీహరికి రాజకీయ భిక్ష పెట్టిండు
నాలుగు దశాబ్దాలుగా అనుభవం ఉన్న కడియం శ్రీహరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివే కానంద విమర్శించారు. శ్రీహరికి దమ్ముంటే బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని, న్యాయ స్థానంలో అనర్హులుగా ప్రకటించబడుతారని తెలిపారు.
స్పీకర్ తీర్పు కాపీలు ఇప్పటీ వరకు తమకు ఇవ్వలేదన్నారు. కడియం శ్రీహరితో పాటు మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి దిక్కుతోచకుండా ఉందన్నారు. కేసీఆర్ కాళ్లు పట్టుకుంటే కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ ఇచ్చారని, ఆ తర్వాత డిప్యూటీ సీఎంను చేశారని ఆయన గుర్తుచేశారు. రాజకీయ భిక్షపెట్టిన కేసీఆర్‌ను కడియం మోసం చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని నమ్ముకొని పోతే కుక్కతోకను పట్టుకుని గోదారిని ఈదినట్లేనని ఆయన విమర్శిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలికి కొట్టుకుపోతుందన్నారు.