విద్యతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యం
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి
జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, నాణ్యమైన విద్యతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు.బుధవారం కెరమెరి మండలంలోని గోయగాం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించిన కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.గ్రామ పాఠశాల అభివృద్ధికి స్థానిక ప్రజలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. విద్యాభివృద్ధికి సమాజం భాగస్వామ్యం కావడం వల్ల పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరూ కలిసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.మండల విద్యాధికారి కూడా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని పాఠశాల అభివృద్ధి కోసం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.






