14 May, 2026 | 2:03 AM

సభ్యత్వంపై బీఆర్‌ఎస్ ఫోకస్

14-05-2026 12:55 AM

కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి గా జీవన్

మంచిర్యాల, అసిఫాబాద్‌కు నారదాసు

కరీంనగర్, మే 13 (విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదుపై తీవ్రంగా దృష్టి సారించింది. కేసీఆర్ నేతృత్వంలో ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ను నియమించాలని ప్రతిపాదించారు. సాధారణ సభ్యత్వం రూ. 10, క్రియా శీలక సభ్యత్వం రూ. 50గా నిర్ణయించారు.

బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆయా జిల్లాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్రం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ తోపాటు ఓటర్ లిస్టు సవరణ, తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని నిర్ణయించారు.

సభ్యత్వ నమోదు సజావుగా నిర్వహించడానికి ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ నమోదు సమన్వయకర్తను నియమించాలని ఆదేశించారు. అందులో భాగంగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల బాధ్యతలను టీ జీవన్రెడ్డికి అప్పగించారు. మంచి ర్యాల, ఆసిఫాబాద్ కు కరీంనగర్ కు చెందిన సీనియర్ నాయకుడు నారదాసు లక్ష్మణ్రావును నియమించారు.

- బూత్ లెవల్ శిక్షణ...

ప్రతి నియోజకవర్గానికీ, రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తనూ నియమించాలని, ప్రతి మండలానికీ, మున్సిపల్ బాడీలవారీగా సభ్యత్వ నమోదు సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీలను 2,3 రోజుల్లో నియమించాలని నిర్ణయించారు. డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున, రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్లలో, బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

డిజిటల్ మెంబర్షిప్ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలపై శిక్షణ ఇవ్వాలలని నిర్ణయించారు.సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలో చేపట్టేందుకు శిక్షణ శిబిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యం లో కొనసాగిస్తారు. సభ్యత్వ నమోదు కోసం ఆయా జిల్లాలకు ఇన్చార్జులని నియమించారు.