28 April, 2026 | 4:28 AM

కోట్లాది గొంతుల గొంతుక బీఆర్‌ఎస్

28-04-2026 01:35 AM

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్నగర్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెబుతూ, కోట్లాది గొంతులను ఏకం చేసిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీదేనని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన గులాబీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ నాటి పాలకుల వివక్షను ఎదిరించి, కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ స్వరాష్ట్రాన్ని సాధించామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ అందాయని తెలిపారు.

నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో బీఆర్‌ఎస్ ఎప్పుడూ రాజీపడలేదని, భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో నుండి కేసీఆర్ను వేరు చేయలేరని, రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ వేడుకల్లో మాజీ సహకార కార్పొరేషన్ చైర్మన్ రాజవరప్రసాద్, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రాంబాల్ నాయక్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, ఆకుల శ్రీశైలం, వివిధ విభాగాల ప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.