18 August, 2026 | 7:30 PM

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 1000 జరిమానా

18-08-2026 06:57 PM

నిందితునికి శిక్ష పడేలా సమర్ధవంతంగా పని చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు ఎలగొండ నవీన్ పై నేరం రుజువు కావడంతో, భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె జీవన్ కుమార్ మంగళవారం నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్లితే.. 2021 సంవత్సరంలో భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలానికి చెందిన మైనర్ బాలిక హనుమకొండలో ఇంటర్ చదువుతున్న సమయంలో ములుగు జిల్లా మల్లూరు శివారు మొట్లగూడెం గ్రామానికి చెందిన ఎలగొండ నవీన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పరుచుకున్నాడు.

ప్రేమిస్తున్నానని నమ్మించి, 2021, ఏప్రిల్ 3వ తేదీన పెళ్లి చేసుకుందామని ఇంటి నుంచి పిలిపించాడు. బాధితురాలు కాటారం మండలం బస్వాపూర్ చేరుకోగా నిందితుడు ఆమెను ములుగు జిల్లా పస్రా మీదుగా బర్లగూడెంలోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి మూడు రోజుల పాటు నిర్బంధించి పలుమార్లు బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం తన స్వగ్రామమైన మొట్లగూడెంకు తీసుకెళ్లి మరో రెండు రోజుల పాటు అదేవిధంగా దాడికి పాల్పడ్డాడు. తన కుమార్తె కనిపించకపోవడంతో బాధితురాలి తండ్రి కాటారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బాధితురాలు ఇంటికి చేరి జరిగిన విషయాన్ని వెల్లడించింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి కాటారం ఎస్ హెచ్ ఓ సాంబమూర్తి కేసు నమోదు చేశారు.

అనంతరం అప్పటి కాటారం డీఎస్పి బోనాల కిషన్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి, పటిష్టమైన సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సమయంలో లైజన్ ఆఫీసర్ జి వెంకన్న ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్ కె రమేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎన్ విష్ణువర్ధన్ రావు, వెంకట్రామ్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు నిందితుడిపై నేరం రుజువైందని నిర్ధారించింది. ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా పని చేసిన ప్రస్తుత, అప్పటి దర్యాప్తు అధికారులను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రత్యేకంగా అభినందించారు.