4 May, 2026 | 4:39 AM

ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు

03-09-2024 02:30 PM

ఖమ్మం, (విజయక్రాంతి): నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి, పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను, రైతులను కలిసి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభ్యుల బృందం రావడం జరిగిందన్నారు.ఆపత్కాలంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదన్నారు. ప్రజలకు ధైర్యం చెప్పవలసిన ముఖ్యమంత్రి రెండు రోజుల పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టుకోడానికి కేసీఆర్ పై, బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం సాబం కాదన్నారు. పెళ్లికి, చావుకి తేడా తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఓదార్పు కొచ్చారా సంబరాలకు వచ్చారా అర్థం కావడం లేదని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ కాల్వ కట్ట దెబ్బతినడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని, రైతులు ఆధారాలు కూడా చూపిస్తున్నారు.

ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు కాలువ కట్ట మీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గాట్లకు వెల్డింగ్ చేసి నీళ్లు పోకుండా చేశారని, గేట్లకు వెల్డింగ్ చేయడం వల్ల వరద వచ్చినప్పుడు గేట్లు తెరుచుకోలేక ప్రెషర్‌కు కట్ట కొట్టుకుపోయిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు, కేవలం అధికార పార్టీ మంత్రులు చేసిన నిర్వాకం వల్లే తెగిందన్నారు.ఖమ్మంలో ప్రజలు చనిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, 9 గంటలు సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చీకటి పడ్డాక మంత్రులు ముసలి కన్నీళ్లు కార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాల్లో మునిగితేలుతున్నారని, ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం, ప్రకృతి సృష్టించిన విలయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంట నష్టపోవడమే కాక మరో రెండు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఇక్కడ రైతులు తమ పొలాలను బాగుచేస్తే చాలు, మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇసుక మేటలు పేరుకుపోయి రాళ్లు రంపలతో పొలాలు నిండిపోయాయి. ప్రభుత్వం కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలలో ఉన్నారన్నారు. గతంలో ఇలాంటి సమయంలో కేసీఆర్ నిద్రపోకుండా మంత్రులందరిని ప్రజల్లో ఉంచి పని చేయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని రైతులు అంటున్నారని ఇక్కడ జరిగిన నష్టానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. పంట కొట్టుకుపోయిన పొలాలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్లు ఇవి, కొత్తవేమీ కాదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.