బీఆర్‌ఎస్ పార్టీనే రాష్ట్రానికి శ్రీరామరక్ష
మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 21(విజయక్రాంతి) : తెలంగాణకు బీఆర్‌ఎస్ పార్టీయే రక్షణ కవచమని మరోసారి రుజువైందని, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాలరాస్తున్న ప్రతిసారీ బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని సవాల్ చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించకుండా పదేళ్లు కేసీఆర్ అడ్డుపడ్డారని పేర్కొన్నారు. గోదావరి, కావేరి అనుసంధానంపై కూడా కేసీఆర్ తిరగబడ్డారని గుర్తు చేశారు.
ఇప్పుడు సింగరేణి బ్లాక్‌ల వేలంపై కేటీఆర్ ప్రశ్నించిన తర్వాతే కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుందని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ హక్కులపై ఎప్పుడు కూడా తన వైఖరిని మార్చుకోలేదన్నారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ తర్వాతనే సింగరేణి సంస్థల బ్లాకులు ఆ సంస్థకే కేటాయించాలని భట్టి కోరారని పేర్కొన్నారు. దొంగ మాటలు పక్కన పెట్టి.. వేలంలో శ్రావణి బ్లాక్ ఉందో లేదో స్పష్టం చేయాలని జగదీశ్వర డిమాండ్ చేశారు. శ్రావణి బ్లాక్‌ను వేలం నుంచి తీసివేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కిషన్ రెడ్డికి ఎన్ని పదవులు వచ్చినా ఆయన తెలంగాణకు చేస్తున్నది ఏమీ లేదన్నారు. బీజేపీ మొదటి నుంచి తెలంగాణను నట్టేట ముంచే పనిచేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్‌లు మేకవన్నె పులులని విమర్శించారు.
కేసీఆర్ ఏం తక్కువ చేశారు?
పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన బాల్కన్ సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. పోచారం బీఆర్‌ఎస్ నేత కాబట్టే ఆయన ఇంటికి మా నేతలు వెళ్లారని పేర్కొన్నారు. పోచారం పార్టీని వీడటం దురదృష్టకరమని అన్నారు. పోచారం ఏం ఆశించి కాంగ్రెస్‌లోకి వెళ్లారో తెలియదని పేర్కొన్నారు.






