మైన్స్ బిల్లును కాంగ్రెస్సే తెచ్చింది
- డిప్యూటీ సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
- మాపీ ఎంపీ వినోద్
హైదరాబాద్, జూన్ 21(విజయక్రాంతి) : మైన్స్ మినరల్స్ 2015 బిల్లుకు పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మైన్స్ మినరల్స్ బిల్లును 2011లో ప్రవేశ పెట్టింది మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఆ బిల్లును బీజేపీ ప్రభుత్వం ఆర్దినెన్స్ రూపంలో తెచ్చిందని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారనడం అర్థరహితమని పేర్కొన్నారు.
భట్టి విక్రమార్క బేషరుతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, మోదీ కలిసి సింగరేణి అమ్ముతున్నారని తాను చెప్పిందే నిజం అవుతోందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు బిల్లుకు మద్దతు ఇవ్వడం కాదని, కాంగ్రెస్సే ఆ బిల్లు తెచ్చిందన్నారు. గతంలో సీఎం కేసీఆర్ సింగరేణిపై కేంద్రానికి రాసిన లేఖనే ఇప్పుడు రేవంత్ ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఢిల్లీకి వెళ్లి సింగరేణిని బతికించాలని సూచించారు. సింగరేణిని చంపేందుకే 8 ఎంపీలు గెలిచారా? ప్రశించారు. సింగరేణి బొగ్లు బ్లాక్‌ల వేలం ఆపాలని డిమాండ్ చేశారు.






