3 August, 2026 | 4:14 AM

సింగరేణికి గనులు ఇవ్వాలి

22-06-2024 01:02 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు శుక్రవారం గనుల వేలం పాట సందర్భంగా కిషన్‌రెడ్డికి లేఖను భట్టి అందజేశారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల దృష్ట్యా సింగరేణికి గనులను కేటాయించాలని భట్టి ఆ లేఖలో కోరారు. అదే సమయంలో కేటీఆర్‌కు ట్విట్టర్‌లో కౌంటర్ ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌ను భట్టి రాసిన లేఖకు జత చేశారు. డిప్యూటీ సీఎం రాసిన లేఖలోని ముఖ్యాంశాలివీ.

  1. * సింగరేణి కాలిరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) అనేది ప్రభుత్వ రంగ బొగ్గు గనుల కంపెనీ. ఈ సంస్థలో కేంద్రం వాటా 49 శాతం, తెలంగాణ వాటా 51శాతం. 135 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ రాష్ట్రంలో ప్రస్తుతం 43,000 మందికి ప్రత్యక్షంగా 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.
  2. * సింగరేణి సంస్థ ఏడాదికి 70 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఎన్‌టీపీసీ, రామగుండం, నాన్-పవర్ సెక్టార్‌ల థర్మల్ పవర్ స్టేషన్‌ల బొగ్గు అవసరాలను తీరుస్తోంది.
  3. * 2024 ఆర్థిక సంవత్సరంలో 72 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో 17 ఓపెన్ కాస్టులు, 22 భూగర్భ గనులను నిర్వహిస్తోంది. ఈ 39 గనుల్లో 2022 నాటికి దాదాపు 22 గనులు మూసివేయబడతాయి. ఫలితంగా 2039 నాటికి సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఏడాదికి 55 టన్నులకు తగ్గుతుంది. 2047 నాటికి అది 35 టన్నులకు క్షీణిస్తుంది. 
  4. * తెలంగాణలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, దీర్ఘకాలిక ప్రాతిపదికన రాష్ర్ట ప్రభుత్వం 4,000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. రామగుండం వద్ద 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్‌టీపీసీ ద్వారా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండు ప్లాంట్లకు ఏడాదికి 40 టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. 
  5. * కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్‌లను వేలం ద్వారా ప్రైవేట కంపెనీలకు కేటాయించారు. ఆ సంస్థలు ఇంకా ఉత్పత్తిని ప్రారంభించలేదు. కాబట్టి ఆ సంస్థలకు కేటాయించిన అనుమతులను రద్దు చేసి ఎంఎండీఆర్ చట్టం, 1957 సెక్షన్ 11ఏ/ఏ2 ప్రకారం సింగరేణికి కేటాయించాలి. ఇందుకోసం సింగరేణి 0.5 రాయల్టీని చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఇది ప్రైవేటు సంస్థలు చెల్లించే దానికంటే అధికం.
  6. * పదో విడత బొగ్గు గనుల వేలం జాబితాలో శ్రావణపల్లి బ్లాక్ చేర్చారు. ఈ బ్లాక్‌ను డీలిస్ట్ చేసి వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలి.