బాలికల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ
- విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న ఆర్డీఓ, తహసీల్దార్
బోధన్,(విజయక్రాంతి): బోధన్ ఆర్డీఓ మరియు తహసీల్దార్ మంగళవారం సాయంత్రం రాకాసిపేటలోని ఎస్‌సీడీడీ కళాశాల బాలికల హాస్టల్ మరియు పాఠశాల బాలికల హాస్టల్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా స్టడీ హాల్, కిచెన్, డైనింగ్ హాల్, విద్యార్థినుల గదులు, మరుగుదొడ్లు తదితర వసతులను పరిశీలించి, హాస్టల్‌లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.
కొంతమంది విద్యార్థినులను పిలిచి పాఠశాలలో నేర్చుకున్న పాఠాలు, చదువులో పురోగతి, మార్కుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని వారికి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థినిని "ఇంటి వద్ద బాగుంటుందా, హాస్టల్‌లో బాగుంటుందా?" అని ప్రశ్నించగా, ఆమె నవ్వుతూ "హాస్టల్‌లోనే బాగుంది" అని సమాధానం ఇవ్వడంతో ఆర్డీఓ, తహసీల్దార్, హాస్టల్ వార్డెన్ ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం వార్డెన్లతో మాట్లాడి హాస్టళ్లలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. స్టోర్‌రూమ్‌లోని సరుకులు, వండిన ఆహారం, కూరగాయల నాణ్యత, రీడింగ్ రూమ్, లైబ్రరీ, ఆటల వసతులు, ప్రాంగణం, పుస్తకాలు, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు తలెత్తుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే విద్యతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ తత్వం, మానసిక ఆరోగ్యం పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.






