2 September, 2026 | 8:06 PM

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ భారీ ధర్నా

02-09-2026 | 07:24pm

గాడిదలతో వినూత్న నిరసన

420 అడుగుల బ్యానర్‌తో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన

ఉప్పల్, సెప్టెంబర్ 2విజయక్రాంతి: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలు, అమలు కాని ఎన్నికల హామీలు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎక్స్ రోడ్డు(Uppal X Roadd) వద్ద బుధవారం భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshma Reddy) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా గాడిదలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు 420 అడుగుల భారీ బ్యానర్‌ను ప్రదర్శించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshma Reddy) మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ధర్నా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మల్కాజిగిరి ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతీకాత్మకంగా బాకీ కార్డుల పంపిణీ కూడా నిర్వహించారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేయగా, ఉప్పల్ ప్రాంతంలో కొంతసేపు రాజకీయ సందడి నెలకొంది.