2 September, 2026 | 8:07 PM

మంచిర్యాలలో 420 హామీల ప్లెక్సీలతో భారీ ర్యాలీ

02-09-2026 | 07:26pm

మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల ప్లెక్సీలతో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వెంకటేశ్వర థియేటర్, అర్చనటెక్స్ చౌరస్తా, మార్కెట్ ఏరియా, మంచిర్యాల బస్టాండు మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు నిర్వహించారు. బెల్లంపల్లి చౌరస్తా వద్ద పెద్ద మొత్తంలో మనహారం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావులు మాట్లాడుతూ.., కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ సంక్షేమ పథకాల నిలిపివేసి పేద ప్రజలను హింసిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

పేదింటి ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం, స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ వంటి హామీలు పూర్తిస్థాయిలో అందడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, ఇతర సంక్షేమ పథకాల అమలు చేయక పోవడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.