calender_icon.png 19 December, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలు మారకుంటే బిఆర్ఎస్ సమావేశానికి హాజరుకండి

19-12-2025 06:21:19 PM

ఎమ్మెల్యేలకు సవాల్ విసిరిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్

హుజురాబాద్,(విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరలేదని ప్రగల్బాలు పలుకుతున్నారని, నిజంగా ఎమ్మెల్యేలు పార్టీ మారకుంటే ఈనెల 21న జరిగే బిఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ పార్టీ మారి ఇప్పుడు చర్యలు తీసుకునే సమయానికి తగు పార్టీలు మారలేదంటూ దొంగ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. నిజంగా పార్టీ మారితే దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు పొంది కష్టకాలంలో పార్టీని వదిలి పోవడం సిగ్గుచేటు అన్నారు.

ఇప్పటికైనా పార్టీ నుంచి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పడంలో నిజాయితీ ఉంటే తప్పక టిఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని అన్నారు. ఒకవేళ హాజరు కాకపోతే వారు పార్టీ మారిన ప్రజా ప్రతినిధులుగా మిగిలిపోతారని అన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు ప్రజల ముందు దోషులుగా నిలబడతారని, భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం కూడా ప్రజలు చెబుతారని అన్నారు.