దూరం తగ్గించండి.. ఓటు హక్కు సులభం చేయండి
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కోరుతూ రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ వినతి
బూర్గంపాడు,(విజయక్రాంతి): పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కోరుతూ బూర్గంపాడు బీఆర్ఎస్ నాయకులు పినపాక నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో రాహుల్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 10లోపు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్న నేపథ్యంలో ఈ వినతి సమర్పించారు.
సారపాక, తాళ్లగొమ్మూరు, కోయగూడెం గ్రామపంచాయతీల పరిధిలోని పలువురు ఓటర్లు తమ నివాస ప్రాంతాలకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ, దూర ప్రాంతాల్లోని కేంద్రాలకు కేటాయించబడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, ఇతర ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేలా వారి నివాస ప్రాంతాలకు సమీపంలోని ఇప్పటికే ఉన్న పోలింగ్ కేంద్రాలకు బూత్‌లను మార్చాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, నాయకులు కొనకంచి శ్రీనివాసరావు, తుపాకుల రవి, తిరుపతి ఏసోబు, సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, చల్లకోటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.






