5 August, 2026 | 12:02 PM

వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.. నాలుగోసారి మార్పుల్లేవ్

05-08-2026 11:26 AM

న్యూఢిల్లీ: భారత రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ద్రవ్య పరపతి విధానాల సమీక్ష నిర్ణయాలను ప్రకటించారు. ఆర్‌బీఐ వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచాలన్న ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) నిర్ణయాన్ని ప్రకటిస్తూ,  సంజయ్ మల్హోత్రా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిరమైన ముడి చమురు ధరలు, ప్రపంచ వాణిజ్య అంతరాయాలతో పాటు ఎల్ నినోను కూడా ఒక కీలక అనిశ్చితిగా పదేపదే ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధికి సంబంధించి RBI చేసే అంచనాలపై ఈ వాతావరణ దృగ్విషయం ఒక కీలకమైన ప్రభావం చూపే అంశంగా మారిందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

విధాన ప్రకటన సందర్భంగా మల్హోత్రా మాట్లాడుతూ, 'ఎల్ నినో' (El Niño) సంబంధిత వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంపై అనిశ్చితి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడిందని తెలిపారు. పశ్చిమాసియా సంఘర్షణలు ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయని వెల్లడించారు. చమురు, ఆహార ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందన్నారు. తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గాయని సూచించారు. Q3లో ద్రవ్యోల్బణం గరిష్ఠానికి చేరి.. తర్వాత తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంఘర్షణతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురయ్యాయని ఆర్‌బీఐ వెల్లడించింది.

వాణిజ్య మార్గాలు, గొలుసు సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగిందన్న ఆర్‌బీఐ మార్కెట్ అస్థిరత పెంచి వ్యాపార సెంటిమెంట్ ను తగ్గించిందని తెలిపింది.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతూనే ఉందని పేర్కొంది. అమెరికా కొత్త సుంకాలతో వాణిజ్య అనిశ్చితి కొనసాగుతోందని ఆర్‌బీఐ గవర్నర్(RBI Governor) సూచించారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం మరింత అస్థిరంగా మారిందని, 2025తో పోలిస్తే 2026లో ద్రవ్యోల్బణం అధికంగా ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది. ముడి చమురు ధరలు, కరెన్సీలు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరత ఏర్పడుతుందని హెచ్చరించింది.