చింతల్ బస్తిలో మౌలిక వసతులకు ప్రాధాన్యం
మార్నింగ్ వాక్‌లో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట, ఆగస్టు 5: పట్టణంలోని 4వ వార్డు పరిధిలోనీ చింతల్ బస్తిలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ(MLA Chikkudu Vamsikrishna ) బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్‌తో కలిసి బస్తిలో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అచ్చంపేట పట్టణాన్ని సమగ్ర పట్టణాభివృద్ధి ప్రణాళికలో భాగంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రతి ప్రాంతానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టేందుకు ఇలాంటి మార్నింగ్ వాక్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.






