6 April, 2026 | 2:23 AM

బీఆర్‌ఎస్ ప్రగతే తెలంగాణలో సజీవ సాక్ష్యం

06-04-2026 12:39 AM
  1. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

50 మంది కాంగ్రెస్  కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరిక

జవహర్ నగర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ చేసిన ప్రగతి తెలం గాణలో సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని, కాంగ్రెస్ నాయకులు మాటలు తప్పితే... అభివృద్ధి చేసింది శూన్యమని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దుయ్యబట్టారు. ప్రజల కోసం పనిచేసేది బిఆర్‌ఎస్ పార్టీయే అని జవహర్ నగర్ లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు మాజీ మేయర్ మేకల కావ్య బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో ఆదివారం బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బిఆర్ ఎస్‌లో పార్టీ కండువాలు కప్పుకొని చేరారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ యువత సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రకటించిన ఉద్యోగాలే కాంగ్రెస్ పాలనలో నియామక పత్రాలు అందజేసిందని విమర్శించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలో కరువు తాండవించేదని బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సారథ్యంతో కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పచ్చని మణిహారంల మారిందన్నారు.

కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి ఎత్తిన దాఖలాలు ఎక్కడా లేవని త్వరలోనే బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోతుందని కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు బిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, మహేష్, కృష్ణ యాదవ్, సతీష్ ,దిలీప్, ధనలక్ష్మి, నీకేతన్ గౌడ్, శ్రీకాంత్, రూపేష్, హరి, సన్నీ, నరేంద్ర, వినోద్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.