ఎన్నికల టెన్షన్.. 3 రోజుల్లో రూ.11లక్షల కోట్ల ఆవిరి
తక్కువ శాతం పోలింగ్ పట్ల ఆందోళన
బీజేపీ/ఎన్‌డీఏ విజయంపై మార్కెట్లో అనుమానాలు
ఇన్వెస్టర్ల భయాలను సూచించే వొలటాలిటీ ఇండెక్స్‌కు రెక్కలు
ముంబై, మే 7: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో తొలి మూడు దశల్లోనూ ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడంతో మార్కెట్లో తలెత్తిన వూహాగానాల ఫలితంగా స్టాక్ సూచీలు తీవ్ర పతనాన్ని చవిచూస్తున్నాయి. వరుసగా మూడు రోజుల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,000 పాయింట్లకుపైగా పతనమయ్యింది. అమ్మకాల ధాటికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 50 రోజు ల చలన సగటు (50 డీఎంఏ)ను మంగళవారం కోల్పోయింది. ఈ మూడు రోజుల్లో రూ. 11 లక్షల కోట్లకుపైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అమెరికా మార్కెట్లు నాలుగు రోజులపాటు వరుసపెట్టి పెరుగుతున్నా, ఇతర ప్రపంచ ప్రధాన సూచీలు పటిష్టంగా ట్రేడవుతున్నా, దేశంలో ఇన్వెస్టర్లు మాత్రం భయాలు చుట్టుముట్టడంతో అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఇన్వెస్టర్ల భయాలను సూచించే వొలటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) వరుసగా 9 రోజులపాటు 66 శాతం పెరిగి 52 వారాల గరిష్ఠానికి చేరింది. ఈ ఇండెక్స్ పెరిగితే రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నట్టు సంకేతంకాగా, వీఐఎక్స్ దిగువస్థాయిలో ఉంటే మార్కెట్ రిస్క్‌కు మదుపుదారులు సంసిద్ధంగా ఉన్నట్టు పరిగణించవచ్చు.
ఫలితాలు వెలువడేంతవరకూ ఒడిదుడుకులే..
ప్రస్తుతం నెలకొన్న వోలటాలిటీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేంతవరకూ కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వస్తాయి. తొలి రెండు దశల పోలింగ్‌లో ఓటు వేసినవారి శాతం బాగా తగ్గడంతో మొదలైన మార్కెట్ టెన్షన్ మంగళవారం మరింత పెరిగింది. మధ్యాహ్న సమయానికి 40 శాతమే ఓటర్లే వారి ఓటు హక్కును వినియోగించుకోవడంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగా యని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ‘కేంద్రంలో అధికారంలోనే పార్టీలు సులభంగా విజయం సాధిస్తాయన్న అంచనా లపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. బీజేపీ/ఎన్‌డీఏ గెలుపును ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్న మార్కెట్ ప్రస్తుతం డైలమాలో పడింది. ఈ కారణంతోనూ బుల్స్ వారి పొజిషన్లను తగ్గించుకునే పనిలో పడ్డారు’ అని నాయర్ వివరించారు.
1,000 పాయింట్ల వరకూ నిఫ్టీ కరెక్షన్..
భారత్ మార్కెట్ అత్యధిక విలువలపై ట్రేడవుతున్నదన్న ఆందోళన కొంతమంది ఇన్వెస్టర్లలో నెలకొనడం కూడా మార్కెట్ పతనానికి ఒక కారణమని నిపుణులు చెపుతున్నారు. పీఈ రేషియో ప్రకారం, ప్రైస్ టు బుక్ రేషియో ప్రకారం చూస్తే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్‌తో ఉన్నదని అడిల్‌టిక్ టెక్నికల్ అనలిస్ట్ ఆదిత్యా ఆరోరా చెప్పారు. ఈ అధిక విలువల కారణంగా వచ్చే కొద్ది వారాల్లో నిప్టీ 1,000 పాయింట్ల నుంచి 4,000 పాయింట్ల మధ్య కరెక్షన్‌కు లోనవుతుందని అంచనా వేశారు. ‘మార్కెట్ అంచనాలకు అనుగుణమైన ఎన్నికల ఫలితాలు వెలువడితే, స్వల్పకాలికంగా స్టాక్ మార్కెట్లో ఒక రౌండు ర్యాలీ జరగవచ్చు. ఆ సందర్భంగా ఏర్పడే టాప్ నుంచి 1,000 పాయింట్ల మధ్య నిఫ్టీ పడిపోతుందని ఆరోరా విశ్లేషించారు. ‘మిడ్‌క్యాప్స్, స్మాల్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ అధిక విలువతోనే ట్రేడవుతున్నాయి. వీటిలో లార్జ్‌క్యాప్స్‌లో ఇప్పటికే కరెక్షన్ జరుగుతున్నది’ అని చెప్పారు.






