సెన్సెక్స్ 380 పాయింట్లు డౌన్
ముంబై, మే 7: వరుసగామూడో రోజూ భారత స్టాక్ సూచీలు గరిష్ఠస్థాయి వద్ద అమ్మకాలను చవిచూశాయి. మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ 74,000 పాయింట్ల స్థాయిని దాటింది. ఆ సమయంలో బ్లూచిప్ షేర్లలో అమ్మకాలు మొదలుకావడంతో ఆ స్థాయి నుంచి 700 పాయింట్లకుపైగా పతనమై 73, 260 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు 384 పాయింట్ల నష్టంతో 73,512 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభంలో 22,500 పాయింట్లకు చేరిన అనంతరం అమ్మకాల ఒత్తిడికి ఆ స్థాయి నుంచి 260 పాయింట్లుపైగా క్షీణించి 22,232 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 140 పాయింట్ల నష్టంతో 22,302 పాయింట్ల వద్ద నిలిచింది.
పడిపోయిన హెవీవెయిట్ షేర్లు
స్టాక్ సూచీల్లో అధిక వెయిటేజి కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు తగ్గడమే మార్కెట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్ బాస్కెట్‌లో వీటితో పాటు పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్‌లు నష్టపోయాయి. ఇవి 1 శాతం మధ్య తగ్గాయి. గత కొద్ది నెలలుగా స్తబ్దుగా ట్రేడవుతున్న ఎఫ్‌ఎంసీజీ షేర్లు తాజాగా భారీ ర్యాలీ నిర్వహించాయి. అనిశ్చిత పరిస్థితులలో పోర్ట్‌ఫోలియోలను సంరక్షించుకునేందుకు ఈ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్టు మార్కెట్ నిపుణులు తెలిపారు. హిందుస్థాన్ యూనీలీవర్ 5 శాతం పెరిగింది. దీంతో పాటు సెన్సెక్స్ బాస్కెట్‌లోని ఇతర ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు నెస్లే, ఐటీసీలు సైతం 2 శాతం మేర లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు కూడా 1 శాతం మధ్య పెరిగాయి.
కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు మంగళవారం సైతం కొనసాగాయి. రూ.3,669 కోట్ల విలువైన షేర్లు వీరు విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత శుక్రవారం రూ. 2,391 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించిన ఎఫ్‌పీఐలు సోమవారం మరో రూ.2,169 కోట్లు వెనక్కు తీసుకున్నారు.
లార్జ్‌క్యాప్స్‌తో కూడిన సెన్సెక్స్‌కంటే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ భారీగా 1.95 శాతం పతనమయ్యింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 1.65 శాతం నష్టపోయింది.. వివిధ రంగాల సూచీల్లో అధికంగా రియాల్టీ ఇండెక్స్ 3.41 శాతం తగ్గింది. యుటిలిటీస్ ఇండెక్స్ 2.85 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 1.73 శాతం, కమోడిటీస్ సూచి 2.18 శాతం, టెలికమ్యూనికేషన్స్ సూచి 1.43 శాతం చొప్పున తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, టెక్నాలజీ ఇండెక్స్‌లు లాభాలతో ముగిసాయి.






