10 July, 2026 | 6:39 AM

డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,307 కోట్లు

08-05-2024 12:57 AM

36 శాతం పెరుగుదల

రూ.7,083 కోట్లకు  చేరిన ఆదాయం

విశ్లేషకుల అంచనాలు మిస్

ముంబై, మే 7 : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన క్యూ4లో 36 శాతం వృద్ధిచెంది రూ.1,307 కోట్లకు పెరిగింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.959.2 కోట్ల కన్సాలిడేటెడ్  నికరలాభాన్ని ఆర్జించింది. క్యూ3లో నమోదు చేసిన రూ. 1,379 కోట్ల నికరలాభంతో పోలిస్తే క్యూ4లో 5 శాతం తగ్గింది. తాజా త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ కన్సాలిడేటెడ్ ఆదాయం 12 శాతం పెరిగి రూ.7,083 కోట్లకు చేరింది. గత ఏడాది క్యూ4లో ఇది రూ.6,296 కోట్లు. క్యూ3తో పోలిస్తే స్వీక్వెన్షియల్‌గా ఆదాయం 2 శాతం క్షీణించింది. మొత్తంమీద తాజా త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. మెజారిటీ బ్రోకరేజ్ సంస్థలు డాక్టర్ రెడ్డీస్ నికరలాభం 50 శాతం పెరుగుతుందని అంచనా వేశాయి. మంగళవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.40 చొప్పున డివిడెండును ప్రకటించింది. వచ్చే ఏజీఎంలో షేర్‌హోల్డర్ల అనుమతి పొందిన ఐదు రోజుల తర్వాత డివిడెండు చెల్లిస్తారు. 

యూఎస్ అమ్మకాల్లో 29 శాతం వృద్ధి

అమెరికా, యూరప్ మార్కెట్లలో డాక్టర్ రెడ్డీస్ లాబ్ అమ్మకాలు బాగా పెరగడంతో  ఆదాయ వృద్ధి సాధ్యపడింది. యూఎస్ జెనెరిక్స్ వ్యాపారం 29 శాతం వృద్ధిచెందగా, యూరప్ అమ్మకాలు 5 శాతం పెరిగాయి. బ్రిస్టల్ క్యాన్సర్ డ్రగ్ రెవ్లిమిడ్‌కు జెనెరిక్ వెర్షన్ అయిన లోరాలిడొమైడ్ అమ్మకాలను యూఎస్‌లో డాక్టర్ రెడ్డీస్ జోరుగా పెంచుకున్నది. 2022లో ఈ ఔషధాన్ని యూఎస్‌లో విడుదల చేసింది.

దేశీయ అమ్మకాల్లో క్షీణత

దేశీయంగా క్యూ4లో డాక్టర్ రెడ్డీస్ ఔషధ విక్రయాలు గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 12 శాతం, స్వీక్వెన్షియల్‌గా 5 శాతం తగ్గి రూ. 1,130 కోట్ల వద్ద నిలిచాయి. కంపెనీ ఇబిటా 14.7 శాతం పెరిగి రూ. 1,872 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్ 25.9 శాతం నుంచి 26.4 శాతానికి చేరింది. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 23.6 శాతం వృద్ధితో రూ. 4,506 కోట్ల నుంచి రూ. 5,568 కోట్లకు పెరిగింది. ఆదాయం 13.5 శాతం పెరిగి రూ.24,588 కోట్ల నుంచి రూ.27,916 కోట్లకు చేరింది.

‘యూఎస్‌లో మా పనితీరు కారణంగా వృద్ధిని, లాభదాయకతను సాధించాం. లైసెన్సింగ్, కొలాబరేషన్, పైప్‌లైన్ బిల్డింగ్ ద్వారా భవిష్యత్ వృద్ధికి బాటలు వేశాం. మంచి పనితీరును కనపర్చడం, ఫ్యూచర్ గ్రోత్ డ్రైవర్స్‌పై పెట్టుబడులు చేయడం ద్వారా మా ప్రధాన వ్యాపారాల్ని పటిష్టపరుస్తాం’

 - జీవీ ప్రసాద్, కోచైర్మన్, ఎండీ, డాక్టర్ రెడ్డీస్