22 August, 2026 | 1:12 AM

బడ్డీ కామెడీ.. రోమాంచకం

22-08-2026 12:25 AM

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తు న్న ఈ చిత్రాన్ని ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించను న్నారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 3న విడుదల కానుంది.

ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ మూవీ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. “భద్రకాళీ పిక్చర్స్ అంటే అందరికీ డ్రీమ్ బ్యానర్. ఈ సినిమా అవకాశం వచ్చాక సూపర్ హ్యాపీగా ఫీలయ్యా. డైరెక్టర్ వేణుగోపాల్ నాతో ఆరు నెలలు రిహార్సల్స్ చేయించారు. సందీప్‌రెడ్డి ‘ఖతర్నాక్ కథ ఉంది వింటావా’ అన్నారు.

ఒక ఇంటెన్స్ కథ ఉంటుందని ఊహించా. వేణుగోపాల్ రెండున్నర గంటలు కథ చెప్తే నాన్ స్టాప్‌గా నవ్వుకున్నా. పేపర్ మీద ఏముందో అదే తెరకెక్కించాడు. కొత్తగా నటించాననే ఫీల్ నాకే కలిగింది. రోమాంచకం టైటిల్‌లోనే కొత్తదనం ఉంది. సెప్టెంబర్ 3న అందరూ ఒక సూపర్ ఎంటర్‌టైనర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు” అన్నారు. హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ.. “8 వసంతాలు’ తర్వాత ఈ కథకే కనెక్ట్ అయ్యా. నేను కోరుకున్న జానర్స్‌లో ‘రోమాంచకం’ కూడా ఉంది” అని తెలిపింది.

డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “కథ చెప్పిన వెంటనే సందీప్, ప్రణయ్ మనం ఈ సినిమా చేస్తున్నామన్నారు. సందీప్ వంగా ఏ రోజూ మా పనిలో జోక్యం కలిగించుకోలేదు. ఫస్ట్ కట్ చూశాక సందీప్ వంగా ఒక బీర్ ఓపెన్ చేసి ఆస్కార్ అవార్డ్‌లా నా చేతికి అందించారు.

ఆ సందర్భం ఎంతో సంతోషాన్నిచ్చింది” అని చెప్పారు. ప్రొడ్యూసర్ ప్రణయ్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. “చిన్న సినిమా అనే ఫీల్ ఎక్కడా రాదు. బడ్డీ కామెడీ మూవీ ఇది” అన్నారు. సునీల్ నారంగ్, ప్రొడక్షన్ డిజైనర్ ఖుషి, నటీనటులు కీర్తన, నరేంద్ర, మణి, సోహన్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.