22 August, 2026 | 2:07 AM

పోలీస్‌శాఖలో అవినీతి తిమింగలాలు

22-08-2026 01:09 AM
  1. ఏసీబీ వలలో పోలీసులు..
  2. నిజామాబాద్‌లో పోలీసులపై వరుసగా ఏసీబీ వల
  3. ఎస్‌ఐలు, సీఐలపై లంచం ఆరోపణలు
  4. పోలీసు శాఖలో అవినీతి నియంత్రణపై మరోసారి చర్చ
  5. పోలీస్ శాఖలో అవినీతి తిమింగలాలు

బోధన్, ఆగస్టు 21 (విజయక్రాంతి): నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలీసు అధికారులు వరుసగా ఏసీబీ వలకు చిక్కుతున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా భూ సమస్య పరిష్కారం కోసం రూ.30 వేల లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్‌ఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పథకం ప్రకారం వల పన్నిన ఏసీబీ అధికారులు, కామారెడ్డిలోని ఎస్‌ఐ నివాసంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

బోధన్‌లోనూ గతంలో ఎస్‌ఐ, సీఐలపై కేసులు

బోధన్లో పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కిన ఘటన గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2020లో అప్పటి బోధన్ పట్టణ సీఐ పల్లె రాకేష్తో పాటు ఎస్‌ఐ మొగిలయ్య, కానిస్టేబుల్ ఏ.గజేంద్ప ఏసీబీ కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వివాదంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.50 వేల నగదు, ఖరీదైన మొబైల్ ఫోన్ను లంచంగా తీసుకుంటున్న సమయంలో సీఐను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.

రూ.7 వేల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ పట్టుబాటు

బోధన్ పోలీస్స్టేషన్లో ఎస్‌ఐగా పనిచేసిన చిత్తనోజు భాస్కరాచారి కూడా లంచం కేసులో ఏసీబీకి చిక్కిన ఘటన నమోదైంది. సివిల్ వివాదానికి సంబంధించిన కేసులో ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసి, చివరకు రూ.7 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో వల పన్నిన అధికారులు, రూ.7 వేల నగదు తీసుకుంటున్న సమయంలో ఎస్‌ఐను పట్టుకున్నట్లు సమాచారం.

లింగంపేటలోనూ ఏసీబీ కేసు

2024 నవంబర్లో లింగంపేట పోలీస్స్టేషన్కు చెందిన ఎస్‌ఐ పి.అరుణ్, స్టేషన్ రైటర్ తోట రామస్వామి రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడిని అరెస్టు చేయకుండా నోటీసు జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు ఆరోపించారు.

అవినీతిపై చర్యలు అవసరం

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే కొందరు అధికారులు లంచం ఆరోపణల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వరుసగా ఎస్‌ఐలు, సీఐలు ఏసీబీకి పట్టుబడుతుండటంతో పోలీసు శాఖలో అవినీతి నియంత్రణ, అంతర్గత పర్యవేక్షణపై మరోసారి చర్చ మొదలైంది. అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సమర్థవంతంగా స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏసీబీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై తుది న్యాయపరమైన నిర్ణయం వెలువడే వరకు ఆరోపణలు నిర్ధారణ అయినట్లుగా పరిగణించరాదని అధికారులు, న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.