22 August, 2026 | 2:46 AM

కాళేశ్వరం బాలాలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు

22-08-2026 01:09 AM

కాళేశ్వరం,ఆగస్టు 21 (విజయ క్రాంతి): శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయ బాలాలయంలో వరలక్ష్మీ వ్రతాలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం ఆచరించేందుకు కాళేశ్వరం పరిసర ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. దీంతో బాలాలయ ప్రాంగణం మహిళా భక్తులతో సందడిగా మారింది.

ఆలయ ఉప ప్రధాన అర్చకులు పనకంటి ఫనీంద్ర శర్మ  ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవికి పూజలు నిర్వహించి, వ్రతాలను ఆచరించారు. కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సర్వశుభాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాధాన్యం ఉండటంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వ్రతానికి హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఆలయ అధికారులు భక్తులకు అందజేశారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఆలయ అర్చక స్వాములు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో మహేష్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయం తరఫున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

శ్రావణమాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ .మహేష్, సర్పంచ్ వెన్నపురెడ్డి. మోహన్రెడ్డి, ధర్మకర్తలు సుంకరి సీతయ్య, గంధసరి సత్యనారాయణ, అశోక్, మంచినీళ్ల దుర్గయ్య ఆలయ సిబ్బంది, అర్చకులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.