10 April, 2026 | 12:41 PM

Breaking News

కబ్జా కోరల్లో బఫర్ జోన్!

02-11-2025 08:47 PM

నిర్మాణాల‌ను ఆపకుంటే ఆందోళనే: బీఆర్ఎస్ నాయ‌కులు సబిత, కార్తీక్ రెడ్డి హెచ్చరిక..

మ‌ణికొండ‌ (విజ‌య‌క్రాంతి): రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రాంతం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. నిబంధనలన్నీ గాలికి వదిలేసి, శ్రీ ఆదిత్య లగ్జరీ బఫర్ జోన్ ప్రాంతంలో కొందరు భారీ కట్టడాలకు తెగబడ్డారు. నార్సింగి నుంచి అత్తాపూర్ వరకు ఈ అక్రమాల పరంపర కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారితీసింది.ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, బీఆర్ఎస్ నేతల బృందం ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది.

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఇంచార్జి కార్తీక్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. బఫర్ జోన్‌లో యథేచ్ఛగా సాగుతున్న నిర్మాణాలను వారు పరిశీలించి, అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ... ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని, దీనిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు స్పందించకపోతే రానున్న రోజుల్లో తమ కార్యాచరణ మరింత ఉదృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.