25 February, 2026 | 8:05 PM

బుగ్గరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు

25-02-2026 06:30 PM

సిద్దిపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దేవస్థాన హుండీ ఆదాయం గణనీయంగా నమోదైంది. శ్రీ పార్వతీ బుగ్గ రాజేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో మొత్తం రూ.5,93,453 ఆదాయం వచ్చినట్లు తెలంగాణ దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి తెలిపారు.

బుధవారం నారాయణరావుపేట మండలం కేంద్రంలోని దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించిన వేలంపాటలు, అన్నదానం, హుండీలు, కట్నాలు, ప్రసాదాల ద్వారా దేవస్థానానికి విశేష ఆదాయం సమకూరిందన్నారు.

దేవస్థానానికి వచ్చిన మొత్తం ఆదాయాన్ని దేవాదాయ శాఖ బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ బాగన్నగారి కరుణాకర్ ముదిరాజ్, ఏఎస్ఐ కిష్టయ్య, ఈవో శ్రీధర్ రెడ్డి, ఆలయ ప్రధాన పూజారి సీతారామ శర్మతో పాటు డైరెక్టర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.