1 July, 2026 | 1:10 AM

గోడ నిర్మించండి సారూ..

01-07-2026 12:18 AM
  1. రక్షణ గోడ లేక ఎన్నో  ప్రమాదాలు
  2. అంబేద్కర్ నగర్ - పీజేఆర్‌జేఆర్ నగర్ మధ్య నెలకొన్న సమస్య

కూకట్‌పల్లి, జూన్ 30 (విజయక్రాంతి) : ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని ఎల్లమ్మబండ అంబేద్కర్ నగర్ కాలనీ పక్కనే ఉన్న పీజేఆర్ నగర్ మధ్యలో 15 అడుగుల ఎత్తున ప్రాంతం ఉండడంతో ఇరు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు కాలనీల మధ్య వ్యత్యాసం ఒకే చోట 15 అడుగుల ఎత్తు ఉండడంతో పై ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ నగర్ చిన్నారులు ఆడుతూ పాడుతూ ప్రమాదవశాత్తు 15 అడుగుల ఎత్తు నుండి పక్కనే ఉన్న కింది ప్రాంతమైన పీజేఆర్ నగర్ లో పడటంతో ప్రమాదాలకు గురవుతున్నారు. 

రెండు  బస్తీల మధ్య ఉన్న ఎత్తున ప్రాంతము లో గతములో అధికారులు కొంత బాగానికి గోడ నిర్మిచినప్పటికి కొంత భాగాన్ని ఎలాంటి నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. దీంతో అంబేద్కర్ నగర్ కాలనీలోని చిన్నారులు ఆడుకుంటూ పీజేఆర్ నగర్ వైపు  కింద పడిపోతారెమో అనే భయంతో పిల్లలను తల్లిదండ్రులు ఆడుకోవడానికి బయటకు పంపడం లేదు. కొద్ది రోజుల క్రితం ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పై నుండి కిందపడి తీవ్ర గాయాలయిన సంఘటన చోటు చేసుకుంది.

గతంలో బోనాల పండుగ రోజు ఊరేగింపుగా వస్తున్న బోనాలను చూడడంలో భాగంగా గోడ చివరి అంచులో నిలబడ్డ ఓ భక్తుడు కాలుజారి 15 అడుగుల కింద పడడంతో కాలు విరిగిపోయిందని స్థానికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే వరద నీరు సైతం ఎత్తయిన  ప్రాంతమైన అంబేద్కర్ నగర్ నుండి కింది ప్రాంతంలో ఉన్న పిజేఆర్ నగర్ ఇళ్లలోకి వరద ప్రవాహం ముంచెత్తి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

వర్షాకాలం వచ్చిందంటే వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని తడిసిపోయి తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అంబేడ్కర్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య ఏర్పడి డ్రైనేజ్ పొంగి పొర్లిన ప్రతిసారి డ్రైనేజ్ మురుగు నీటితో   ఇబ్బందులు పడుతున్నామని పి జె ఆర్ నగర్ వాసులు వాపోతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడంలో భాగంగా రెండు కాలనీల మధ్య 5 ఫీట్ల గోడను నిర్మించినట్లయితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొంత భాగానికి గోడ నిర్మించిన అధికారులు పూర్తిగా గోడను ఎందుకు నిర్మించలేకపోయారో అర్థం కావడం లేదని వాపోయారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇరుకాలనీల మధ్య నెలకొన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా వదిలేసిన గోడను పూర్తి చేసి మమ్ములను ప్రమాదాల నుంచి కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.

అధికారుల స్పందన కరువైంది..

గతంలో ఎన్నోసార్లు ఈ సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలని ఆడుకోవడానికి బయటకు పంపించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నం. కాలనీలు ఏర్పడి 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ స్థానిక నాయకులు అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడం విచారకరం.

 గోపాస్ రవీందర్, అంబేద్కర్ నగర్ వాసి

రక్షణ గోడ నిర్మించాలి..

వర్షాలు వచ్చాయంటే అంబేద్కర్ నగర్‌లోని వరద నీరు మొత్తం మా ఇళ్లలోకి వస్తుంది. ఇళ్లలోని సామాన్లు వరద నీటితో తడిసిపోతున్నాయి. అంబేద్కర్ నగర్ డ్రైనేజ్ నీరు సైతం మా ఇళ్లలోకి వస్తుంది. మురుగు నీటితో కంపుతో సహవాసం చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోడ ఏర్పాటు చేయాలి.

 సుశీల, పీజేఆర్ నగర్ వాసి