త్వరలోనే దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు
- పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 27 : దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. “ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్ రైల్ కారిడార్లను విస్తరించడా నికి అన్ని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనుంది. తొలుత తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో ఈ అధ్యయనం కొనసాగనుంది” అని తెలిపారు. సరికొత్త భారత్ ముఖ చిత్రాన్ని అత్యాధునిక మౌలిక సదుపాయాలు మార్చేస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే మొదలైన అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు వ్యవస్థ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదా పు 508 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ కారిడార్ దేశంలోనే మొదటిది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ లెక్కన బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే.. అహ్మదాబాద్, ముంబై నగరాల మధ్య ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాల్లో పూర్తవుతుంది.






