నీట్ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం
- పార్లమెంట్‌లో రాష్ట్రపతి ఉద్ఘాటన
- ఎన్డీయేపై విశ్వాసంతోనే మళ్లీ ప్రజలు గెలిపించారు
- పదేళ్ల పాలనలో సుస్థిరాభివృద్ధి సాధించాం
- ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
- ఎమర్జెన్సీపై ముర్ము వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
- స్పీకర్‌ను కలిసి అసంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, జూన్ 27: 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశం గురువారం జరిగింది. సభ ఆనవాయితీ ప్రకారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ విజయాలను, రాబోయే ఐదేళ్ల కాలంలో సర్కారు లక్ష్యాలను వెల్లడించారు. అంతకుముందు రాష్ట్రపతికి పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ సెంగోల్ (రాజదండం)తో స్వాగతం పలికారు.
దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యంతరం తెలిపింది. మరోవైపు రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎమర్జెన్సీపై మాట్లాడటం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ విషయంలో విపక్షాలు నిరసన తెలుపగా ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఏకంగా స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి అవి రాజకీయపరమైన వ్యాఖ్యలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిందే రాష్ట్రపతి చదువుతారని, సొంతంగా చెప్పేదేమీ ఉండదని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.
విశ్వాసంతోనే మళ్లీ గెలిపించారు
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగాయని రాష్ట్రపతి అన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లోనూ సుస్థిర ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఎన్డీయే పాలనా సామర్థ్యాన్ని నమ్మి మరోసారి అవకాశం కల్పించారన్నారు. దేశ ప్రజ ల నమ్మకాన్ని గెలిచి మీరంతా సభకు వచ్చారని, ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు ఆశించిన ఫలితాలు సాధిస్తారని ఎంపీలకు ఆశిస్తున్నట్లు తెలిపారు.
లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు
రాష్ట్రపతి తన ప్రసంగంలో ముఖ్యంగా ఇటీవల జరిగిన పరీక్షల లీకేజీపై స్పందించారు. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలన్నారు. పోటీ పరీక్షలు పారదర్శకంగా జరగాలని ఆకాంక్షిం చారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలపై ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోం దని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రభుత్వం, విపక్షాలు వ్యవహరించాలని సూచించారు. నీట్‌తో పాటు అన్ని పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎమర్జెన్సీ ప్రస్తావనపై దుమారం
రాష్ట్రపతి ఎమర్జెన్సీపై స్పందించారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత చరిత్రలో చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణించారు. ఎమర్జెన్సీ రోజుల్లో ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారని తెలిపారు. అయినా రాజ్యాంగ విరుద్ధ శక్తులకు వ్యతిరేకంగా దేశం విజయం సాధించిందని ఉద్ఘాటించారు. రాష్ట్రపతితో పాటు స్పీకర్ ఎమర్జెన్సీని ప్రస్తావించడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి.
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన చాంబర్ కలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయపరమైన వ్యాఖ్యలని, దీనిని నివారించి ఉండవచ్చని స్పీకర్‌కు తెలియజేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్పీకర్‌కు లేఖ రాశారు. 50 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను ప్రస్తావించడం దిగ్భ్రాంతికరమని, సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.
సెంగోల్‌పై వివాదం
గురువారం ఉభయ సభల సంయుక్త సమావేశానికి ముందు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద రాష్ట్రపతికి ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు రాజదండం (సెంగోల్)తో సాదర స్వాగతాన్ని పలికారు. అయితే, లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన రాజదండాన్ని అమర్చడంపై విపక్షాలు విమర్శలు చేశాయి. రాజదండానికి ప్రాముఖ్యం ఏముందని ప్రశ్నించాయి. రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని ఏర్పాటు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. సెంగోల్ అనేది రాజు చేతిలో ఉండే కర్ర అని, కానీ మనది ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. అయితే, బీజేపీ ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది. గతంలో రామచరితమానస్‌పైనా ఎస్పీ విమర్శలు చేసిందని, ఇప్పుడు భారత సంస్కృతి ముఖ్యంగా తమిళ సంస్కృతిలో భాగమైన రాజదండంపైనా ఆరోపణలు చేస్తోందని కౌంటర్ ఇచ్చింది. ఈ విషయంలో డీఎంకే పార్టీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా? స్పష్టం చేయాలని ఎదురు ప్రశ్నించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ భారత చరిత్ర, సంస్కృతిపై ఎస్పీకి ఎలాంటి గౌరవం లేదని విమర్శించారు. సెంగోల్‌పై ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండించదగినవి అని పేర్కొన్నారు. ఇది తమిళ సంస్కృతిపై ఇండియా కూటమి కి ఉన్న ద్వేషాన్ని ప్రతిబింబిస్తుందని ఆరోపించారు.
రాష్ట్రపతి ప్రసంగంలో ముఖ్యాంశాలు
గత పదేళ్లలో ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి సాధించింది. జమ్ముకశ్మీర్ అంశంలో అంతర్జాతీయ వేదికలపై శత్రువుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది. కశ్మీర్ లోయలో మార్పు కనిపించింది. ప్రజలు శత్రువుల కుట్రలకు గట్టిగా బదులిచ్చి పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఏ చర్యనైనా తీవ్రంగా ఖండించాలి.
సంస్కరణలు, పనితీరు, మార్పుపై ప్రజలు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. పీఎం సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు రూ.3.20 లక్షల కోట్లు అందించింది. ఆర్గానిక్ ఉత్పత్తుల డిమాండ్‌కు అనుగుణంగా ఎగుమతులు చేస్తోంది.
ఆరోగ్య రంగంలోనూ దేశం అగ్రగామిగా ఉంది. ఆయుష్మాన్ భారత్ గేమ్ చేంజర్‌గా నిలిచింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందాయి.
సంక్షేమంలో సంస్కరణలు అమలు చేస్తున్నాం. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. వారి సాధి కారతకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నాం. భారీగా పెట్టుబడులు పెట్టాం.
ప్రపంచ వృద్ధిలో భారత్ 15 శాతం భాగస్వామ్యం అందిస్తోంది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరరిగాయి. గ్రీన్‌ఎనర్జీ సాధనకు ప్రభుత్వం పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ వేగంగా జరుగుతోంది. విమానయాన రంగ ంలోనూ సంస్కరణలు తీసుకొ చ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చాం.
డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పుత్తుల ఎగుమతులు పెరిగాయి.
సీఏఏ ద్వారా శరణార్థులకు పౌరసత్వం కల్పించాం. జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తున్నాయి.






