హైదరాబాద్, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు
హైదరాబాద్: హెచ్ఐసీసీలో వికసిత్ భారత్ 2047(Viksit Bharat 2047) సాంకేతికత పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్, చెన్నై , బెంగళూరును కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు రానున్నాయని అశ్వినీవైష్ణన్ ప్రకటించారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ ను కేంద్రం భారీగా పెంచిందని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఇచ్చిన రైల్వే బడ్జెట్ రూ. 880 కోట్లు మాత్రమే అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్(Narendra Modi's government) కేవలం తెలంగాణకే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1030 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పూర్తయిందని కేంద్రమంత్రి సూచించారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరణకు నిధులు ఇచ్చామన్నారు. వందేభారత్ రైలుతో ప్రపంచంలోని ఏ రైలు కూడ సరితూగదని పేర్కొన్నారు. తెలంగాణకు ఐదు వందేభారత్ రైలు సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు.






