భారతనౌకదళం అమ్ములపొదిలో మరో అస్త్రం
INS మహేంద్రగిరి యుద్ధనౌక జాతికి అంకితం
భారత నౌకాదళంలో సరికొత్త యుద్ధనౌక 'మహేంద్రగిరి'
అమరావతి: విశాఖలో యుద్ధనౌక మహేంద్రగిరి(INS Mahendragiri) కమిషనింగ్ వేడుక నిర్వహించారు. యుద్దనౌక ఐఎన్ఎస్ తూర్పు నావికాదళంలో కొలువుదీరనుంది. కమిషనింగ్ వేడుకలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) పాల్గొన్నారు. యుద్ధనౌకను రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నీలగిరి శ్రేణి నౌకను నిర్మించిననట్లు తెలిపారు. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం అప్రమత్తంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోతుందని అప్రమత్తం చేశారు. డ్రోన్లు, సైబర్ దాడుల రూపంలో సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని రాజ్ నాథ్ హెచ్చరించారు. సాంకేతికంగా ఇంకా బలంగా ఉండేలా నూతన ఆవిష్కరణలకు ప్రణాళికలు చేయాలని సూచించారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా అమ్ములపొదిలో మరో అస్త్రం చేరిందని కొనియాడారు. శత్రు రాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకుపోవడం దీని ప్రత్యేకతని తెలిపారు.
భారత్ రక్షణ రంగం(India defense sector) మరింత బోలోపేతం చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందన్నారు. అత్యాధునిక, సరికొత్త యుద్ధనౌకలను నావికాదళం సమకూర్చుకుంటుందని పేర్కొన్నారు. స్వదేశీ నైపుణ్యంతో రూపుదిద్దుకొని సేవలందించేందుకు మహేంద్రగిరి సిద్ధమైందన్న రక్షణ మంత్రి భవిష్యత్తులోనూ మరిన్ని ఆవిష్కరణలు రాబోతున్నాయని ప్రకటించారు. భద్రత, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని 'మహాసాగర్' పేరిట నూతన దృక్పథాన్ని ఆవిష్కరించారని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. సముద్ర మార్గాల భద్రతను మరింత పెంచడం తమ ముందున్న ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.






