పంటలను కాపాడుకునేందుకు తప్పని తుంపర సేద్యం
బోథ్,(విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్న భూగర్భ జలాలు అంతంతే ఉన్న మొలకెత్తిన పత్తి సోయాబీన్ పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొదట వర్షాలు పంటల సాగుకు అనుకూలంగా కురవడంతో రైతులు హుషారుగా తమ తమ పంటచేలలో విత్తనాలు నాటారు అయితే విత్తనాలు మొలకెత్తడంతో రైతులు ఆనందపడ్డారు. గత పది రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన అలుముకుంది.
మొలకలను కాపాడుకునేందుకు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో నీటి వసతి ఉన్న భూముల్లో తుంపర సేద్యం వైపు దృష్టి సారించారు. దీంతో అక్కడక్కడ పంటలకు నీటి తడు లను పెడుతున్నారు. నీటి వసతి లేని రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఊరిస్తున్న మేఘాలు.. ఆకాశంలో ప్రతిరోజు మేఘాలు కమ్ముకు వస్తున్నాయి. ఈదురుగాళ్ల తాకిడికి మేఘాలు వచ్చినట్టే వచ్చి తరలిపోతున్నాయి దీంతో రైతుల ఆశలు అడియాశలు అవుతున్నాయి ఎల్ ని నో ప్రభావం రైతన్నను తాకింది.
శాస్త్రవేత్తలు హెచ్చరించిన విధంగానే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంట ఎదుగుతుందో లేదోనని రైతన్న ఎదలో ఆందోళన నెల కొంది దేవునిపై భారం వేసి రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. పంట పెట్టుబడులు పెట్టి వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి కన్నెర్ర మూలంగా రైతన్న ఆందోళనకు గురవుతున్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగు విషయంలో రైతులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది లేకుంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు మరింత ఆర్థికంగా దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. చేతిలో చిలిగవ్వలేక అప్పులు చేసి పంట పెట్టుబడులు పెట్టిన రైతందానికి దేవుడు పెట్టిన పరీక్షను ఏ విధంగా ఉందామని మదన పడుతున్నారు వర్షాలు కురవకపోతే వేల ఎకరాలను పంట నష్టపోయి రైతులు ఆర్థికంగా మరింత కృంగిపోయే ఆస్కారం ఉంది






