29 April, 2026 | 8:43 PM

పంట వ్యర్థాలను కాల్చడం వల్ల దిగుబడులు తగ్గుతాయి

29-04-2026 06:48 PM

– ఏఓ చంద్రశేఖర్ రెడ్డి

దమ్మపేట,(విజయక్రాంతి): మండలంలోని రైతులు వరి కోతల అనంతరం పొలాల్లో మిగిలిన వరి దుబ్బులను, కొయ్యకాళ్లను తగులబెట్టే పద్ధతిని తక్షణమే మానుకోవాలని దమ్మపేట మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మండలంలోని నాగుపల్లి, నాచారం, గణేష్ పాడు, మందలపల్లి, మొద్దులగూడెం, గండుగులపల్లి, ముష్టిబండ తదితర గ్రామాల్లో వరి వ్యర్థాలను తగులబెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనివల్ల రైతులకు అపారమైన నష్టం కలుగుతోందని  అన్నారు. ఒక ఎకరా పొలంలో దుబ్బులను కాల్చడం వల్ల సుమారు 5 టన్నుల విలువైన సేంద్రియ ఎరువును రైతులు నష్టపోతున్నారని ఆయన వివరించారు.

దీనివల్ల నేలలోని హ్యూమస్ తగ్గిపోవడమే కాకుండా, మొక్కకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సల్ఫర్ వంటి పోషకాలు గాలిలో కలిసిపోతాయని తెలిపారు. ఇలా కాల్చడం వల్ల ఎకరాకు సుమారు రూ.3,000 విలువైన ఎరువులను రైతులు వృధా చేసుకుంటున్నారని తెలిపారు.మంటల వేడికి భూమి పైపొరలో ఉండే వానపాములు, మిత్ర పురుగులు, మేలు చేసే సూక్ష్మజీవులు 2.5 సెం.మీ లోతు వరకు చనిపోతాయని, దీనివల్ల నేల గుల్లబారడం తగ్గిపోయి గట్టిగా మారుతుందని తెలిపారు. ఫలితంగా భూమికి నీటిని పీల్చుకునే శక్తి తగ్గిపోతుందని హెచ్చరించారు.

అంతేకాకుండా వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి వాయువుల వల్ల గాలి కాలుష్యమై ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, కంటి మంటలు వస్తాయని ఏఓ తెలిపారు. రోడ్డు పక్కన పొలాలను కాల్చడం వల్ల వచ్చే పొగతో వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, పర్యావరణానికి గ్లోబల్ వార్మింగ్ ముప్పు పొంచి ఉందని వివరించారు. పంట వ్యర్థాలను కాల్చడానికి బదులు రోటవేటర్ లేదా ఎంబీ ప్లౌతో భూమిలో కలియదున్నాలని సూచించారు. ఐఏఆర్ఐ (IARI) వారి 'వేస్ట్ డీకంపోజర్' వాడితే 15 రోజుల్లోనే వ్యర్థాలు కుళ్లిపోయి అద్భుతమైన ఎరువుగా మారుతాయన్నారు.

ఇలా చేయడం వల్ల ఎకరాకు 25 కిలోల యూరియా, 12 కిలోల డీఏపీ ఆదా అవ్వడమే కాకుండా, దిగుబడి కూడా 10-15 శాతం పెరుగుతుందని రైతులకు సూచించారు.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిబంధనల ప్రకారం పంట వ్యర్థాలను కాల్చడం నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎకరా విస్తీర్ణాన్ని బట్టి రూ.2,500 నుండి రూ.15,000 వరకు జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. రైతులు నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని మండల వ్యవసాయ అధికారి, చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.