21 May, 2026 | 3:03 AM

కాల్చితే కాలుష్యం.. కలియదున్నితే భూసారం..

21-05-2026 01:52 AM

వరి కొయ్యలకు నిప్పుతో పర్యావరణానికి ముప్పు

భూమిలో కలియ దుండడంతో భూసార వృద్ధి.   

కాల్చితే భవిష్యత్ పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం

చిట్యాల, మే 20 : వరి కోతల సీజన్ ముగించుకున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మరోసారి పంట అవశేషాల దహనం ఆందోళన కలిగిస్తోంది. వరి కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరిగడ్డి కొయ్యలను రైతులు పెద్ద ఎత్తున తగలబెడుతుండటంతో భూమి సారవంతత దెబ్బతింటుండటమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం అధిక శాతం రైతులు వరి కోత కోసం హార్వెస్టర్ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ యంత్రాలు పంటను వేగంగా కోయగలిగినా, గడ్డిని పూర్తిగా నేలమట్టం చేయకుండా కొంత ఎత్తులో వదిలేస్తున్నాయి. దీంతో పొలాల్లో పెద్ద మొత్తంలో గడ్డి మిగిలిపోతుంది. తరువాత దుక్కి దున్నే సమయంలో ఆ గడ్డి అడ్డంకిగా మారుతుండటంతో రైతులు సులభ మార్గంగా వాటిని నిప్పంటించి కాల్చేస్తున్నారు.

అయితే ఈ చర్య భూమికి తీవ్రమైన నష్టం కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. పంట అవశేషాలను తగలబెట్టినప్పుడు మట్టిలో సహజంగా ఉండే తేమ పూర్తిగా ఆవిరైపోతుంది. అంతేకాకుండా పంటలకు అవసరమైన పోషకాలను అందించే అనేక రకాల సూక్ష్మజీవులు, జీవరాసులు అగ్నికి ఆహుతవుతాయి. భూమిలో నత్రజని, కార్బన్ వంటి ముఖ్యమైన పోషకాలు తగ్గిపోవడంతో మట్టి క్రమంగా సారాన్ని కోల్పోతుంది.

మట్టిగట్టిపడి సాగుకు ఇబ్బందులు

వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం పంట అవశేషాలను తరచుగా కాల్చడం వల్ల మట్టి గట్టిపడి భూమి సహజ నిర్మాణం దెబ్బతింటుంది. దీంతో తదుపరి పంటల సాగులో దుక్కి దున్నడం కష్టమవుతుంది. నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోవడంతో రైతులు అధికంగా నీరు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా సాగు ఖర్చులు పెరిగి రైతులపై ఆర్థిక భారం పడుతోంది.

పర్యావరణానికి ముప్పు

పంట అవశేషాలను కాల్చినప్పుడు వెలువడే పొగ వాతావరణంలో కలిసిపోయి కాలుష్యాన్ని పెంచుతోంది. ఈ పొగలో ఉండే హానికర వాయువులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ పొగ ప్రమాదకరంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయంలో పొగమంచు మాదిరిగా పొగ వ్యాపించడం వల్ల రహదారులపై వాహనదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రమాదాలకు కూడా ఇది కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు.

కలియ దున్నితేనే భూసార అభివృద్ధి

వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలిపితే అవి సహజ సేంద్రియ ఎరువులుగా మారతాయి. దీంతో మట్టిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూమి మరింత సారవంతంగా మారుతుంది. భవిష్యత్తులో మంచి దిగుబడులు రావడమే కాకుండా రసాయన ఎరువుల వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పంట అవశేషాలను భూమిలో కలిపేందుకు ప్రస్తుతం ప్రత్యేక యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు.

సేంద్రియ ఎరువుగా మార్చడం శ్రేయస్కరం

వరి కొయ్యలను పొలంలోనే కలియ దున్నేసి, డీకంపోజర్ చల్లడం వల్ల అవి కొద్ది రోజుల్లోనే కుళ్లిపోయి అద్భుతమైన సేంద్రీయ ఎరువుగా మారుతాయి. ఈ గడ్డిని స్ట్రా బేలర్ మిషన్ల ద్వారా కట్టలుగా కట్టి పశువుల మేత కోసం విక్రయించడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది.

ఈ అవశేషాలను భూమిపై పరచడం వల్ల కలుపు మొక్కలు రావు, భూమిలో తేమ ఎక్కువ కాలం ఉంటుంది. వరి కొయ్యలను కాల్చడం అంటే రైతు తన చేతులతో తన భూమిని, సంపదను కాల్చుకోవడమే  కాబట్టి ఆధునిక యంత్రాలు లేదా జీవ రసాయనాల సహాయంతో వాటిని ఎరువుగా మార్చుకోవడమే రైతుకు అన్ని విధాలా శ్రేయస్కరం.

వరి కొయ్యలను తగలబెట్టడం మానుకోవాలి

తాత్కాలిక సౌలభ్యం కోసం వరి కొయ్యలను  తగలబెట్టడం మానుకోవాలి. తగలబెట్టడం వలన పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించి,  భవిష్యత్తులో భూమి సారం దెబ్బతిని  వ్యవసాయానికే ముప్పుగా మారుతుంది. భూమిని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత, పర్యావరణ పరిరక్షణలో రైతుల పాత్ర ఎంతో కీలకం. ఈరోజు మనం కాల్చేది గడ్డి మాత్రమే కాదు, భవిష్యత్తు పంటల సారాన్ని కూడా అనే విషయాన్ని రైతులు గుర్తించుకోవాలి. పంట అవశేషాలను తగలబెట్టకుండా సేంద్రియ ఎరువులుగా వినియోగిస్తే భూమి సారవంతం అవుతుంది.

- పగిడిమర్రి గిరిబాబు

చిట్యాల మండల వ్యవసాయ అధికారి