పార్కింగ్ స్థలాలుగా బస్టాప్‌లు
- ప్రజాధనం రోడ్డు పాలు
- ఛలాన్లకే పరిమితమైన ట్రాఫిక్ పోలీసులు
కూకట్ పల్లి, జూన్ 12 (విజయక్రాంతి): నగరంలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్స్ కొన్ని నిరుపయోగంగా మారి కార్ ల పార్కింగ్ అడ్డాగా మారుతున్నాయి. జాతీయ రహదారికి ఆనుకొని కెపిహెచ్ బి కాలనీ రెండొవ రోడ్డు నుండి నాలుగొవ వ రోడ్డు వరకు ఏర్పాటుచేసిన బస్సు షెల్టర్స్ ప్రయాణికులకు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా మారాయి.
అక్కడ ఆర్టీసీ బస్సులు ఆపకపోవడం ఒక కారణం అయితే అసలు బస్సులే ఆగనిచోట బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయడం మరొక కారణం. దీంతో ఈ బస్సు షెల్టర్లు మందు బాబులకు కార్ పార్కింగ్ లకు అడ్డగా మారాయి. నిత్యం ప్రయాణికులతో రద్ది గా ఉండే ప్రాంతాలను వదిలి రోడ్డు పక్కన ఖాలి స్థలాలు ఉన్న చోట్ల అధికారులు బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడంతో అవి ప్రయాణికులకు వినియోగంలో లేకుండా పోతున్నాయి.
ఆర్టీసీ ప్రయాణికులకు బస్ షెల్టర్లతో సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు అవగాహన లేకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నిరుపయోగంగా ఉన్న బస్సు షెల్టర్లను మద్యం సేవించడం మందు బాబులు తమ అడ్డాలుగా మార్చుకొని మద్యం సేవించడం అక్కడే పడుకోవడం లాంటివి చేస్తున్నారు.
దీనికి తోడు అడిగే వారే లేరనే ధైర్యంతో కొందరు కారు యజమానులు నిర్భయంగా తమ కారులను వద్ద పార్కింగ్ చేస్తున్నారు. దీంతో కొన్ని లక్షల రూపాయలు రోడ్డు పాలవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలువ నీడ లేని చోట ఇలాంటి బస్సు షెల్టర్లను నిర్మిస్తే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఛలాన్లకే పరిమితమైన ట్రాఫిక్ పోలీసులు..
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నేషనల్ హైవే పక్కనే అక్రమ పార్కింగ్ చేస్తున్న కార్ ల యజమానులకు చలాన్లు పంపుతున్నారే తప్ప పార్కింగ్ చేయకుండా నిరోధించ లేక పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై వేలాది వాహనాలతో ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు.
నిత్యము ట్రాఫిక్ సమస్యతో నరకమనుభవిస్తున్న కెపిహెచ్ బి కాలనీ వాసులు అక్రమ పార్కింగ్ లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమంగా పార్కింగ్ చేస్తున్న కార్ ల యజమానులకు చాలన్ ల తో పాటు అక్రమ పార్కింగ్ దారుల పై కఠిన చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ సమస్యకు కొంత ఊరట కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






