ఆఫ్రికాలో వ్యాపార అవకాశాలు పుష్కలం
- ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయదేవ్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : ఆఫిక్రా ఖండంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయదేవ్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆఫ్రికాలో వ్యాపార అవకాశాలు అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ.. ఆఫ్రికా చాలా గొప్ప సహజ వనరులు ఉన్న ఖండమని పేర్కొన్నారు. అక్కడున్న వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆఫ్రికన్ దేశాలు తమ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాయన్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆఫ్రికన్ దేశాలు అనేక సౌకర్యా లను కల్పిస్తున్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
పెట్టబడులకు ఆఫ్రికా స్వర్గధామం
బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ ప్రమోద్ కుమార్.. ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు. ఆఫ్రికా వ్యాపారం చేయడం వల్ల సున్నా పన్నుతో యూరప్‌కు ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చని చెప్పారు. ఇది పెట్టుబడిదారులకు అధిక రాబడిని ఇస్తుందని, అలాగే వ్యాపార విస్తరణకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆఫ్రికా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖండమని, పెట్టుబడులకు అదొక స్వర్గధామమని ప్రమోద్ కుమార్ వివరించారు.
వ్యవసాయంతో పాటు, కలప, వస్త్రా లు, జీడిపప్పు, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, ఖనిజాలు, నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఆఫ్రికాలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పారిశ్రామికాభివృద్ది కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గరిమెళ్ల, ఎఫ్‌టీసీసీఐ అంతర్జాతీయ ట్రేడ్ కమిటీ సభ్యుడు ఏవీపీఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.






