calender_icon.png 19 February, 2026 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో క్యాబినెట్ సమీక్షనా?

19-02-2026 02:01:29 AM

  1. ఢిల్లీ దర్బార్‌లో మోకరిల్లుతున్న తెలంగాణ ప్రభుత్వం
  2. ఖర్గే, రాహుల్ గాంధీకి లేఖ రాసిన మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): తెలంగాణ క్యాబినెట్‌ను ఢిల్లీకి పిలిపించుకుని ‘మీరు చేయబోయే సమీక్షను చూస్తుంటే.. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోంది’ అని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. స్వయం పాలన కోసం, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టం.. ఇవాళ మీ ఢిల్లీ దర్బార్‌లో మోకరిల్లడం ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తున్నదని మండిపడ్డారు.

జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సహా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బహిరంగ లేఖను హరీశ్‌రావు బుధవారం రాశారు. ‘ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న మీకు, ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నా.

వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పటికే రెండున్నరేండ్లు గడిచింది. మిగిలిన కొద్ది కాలంలో అయినా మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి త్వరగా నెరవేర్చాలి. ఆ దిశగా మీ ముఖ్యమంత్రికి హితబోధ చేయాలి’ అని లేఖలో కోరారు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారని, తీరా చూస్తే బిల్లు ‘నిల్లయింది’, ప్రజల విశ్వాసం ‘కిల్లయింది’ దన్నారు.

ఈ ప్రజా విద్రోహానికి క్షమాపణలు చెబుతూ మీ సమీక్ష ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ‘సోనియా గాంధీ గారూ.. ఆరు గ్యారెంటీల అమలుకు మీరు స్వయంగా హామీ పడుతూ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి ప్రజల ఓట్లు పొందారని, మీ ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఆ బాండులకు విలువ లేకుండా పోయింది.. అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయాయి’ అని విమర్శించారు.