యుద్ధం ఆపడానికి ఆలోచిస్తున్నా..
కానీ కాల్పుల విరమణకు సిద్ధంగా లేం
మిత్ర దేశాలకు భద్రత కల్పిస్తున్నాం : ట్రంప్
హర్మూజ్ బాధ్యత తీసుకోవాలని వివిధ దేశాలకు పిలుపు
వాషింగ్టన్, మార్చి 21: పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధ జ్వాలలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అయితే, కాల్పుల విరమణకు మా త్రం తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. ఇరాన్‌పై సాధించిన సైనిక విజయాలను వివరిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. ఇరాన్‌పై తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. మా సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు.
ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుంద న్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హర్మూజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై ఆధారపడిన దేశాలు నౌకల సురక్షిత ప్రయాణానికి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఒకవేళ తమ సాయం కోరితే.. సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.




