calender_icon.png 12 September, 2024 | 11:41 PM

ఆకలిని భరిస్తారు.. అణిచివేతను భరించలేరు!

18-07-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్ర సాధన ఆరు దశాబ్దాల కల. దేశ స్వాతంత్య్రం అనంతరం పలుమార్లు పడిలేచిన కెరటంలా సాగిన ఉద్యమం 2009 తర్వాత ఉవ్వెత్తున ఎగిసింది. విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో సామాన్యులు కూడా కలిసి వచ్చారు. చేయి చేయి కలిపి ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు పెట్టేలా చేశారు. ఫలితంగా 2014లో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ పోరులో మాత్రం పాలమూరు జిల్లా మాత్రం గుండెకాయగా నిలిచింది. పాలమూరు కరువు ప్రాంతమంటూ.. మా బిడ్డలవి వలస బతుకులని చెప్పుకుంటూ.. అమరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాకారం అయింది. పాలమూరు ఉద్యమకారుడు రమేశ్‌గౌడ్ తన ఉద్యమ అనుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో నిర్వహించిన సమావేశంలో పాలమూరు వెనకబడిన ప్రాంతమంటూ వాస్తవాలను తెలియజేసి ఇక్కడ ధీన స్థితిని దేశమంత తెలిసేలా చేస్తూ ఎంతో మంది ప్రాణత్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం కలను సాధించుకున్నాం. పదేళ్ల పాలనలో దగా పడిన పాలమూరు ప్రగతిని స్వరాష్ట్ర పాలకులు సైతం మరిచిపోయారు.  

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా ప్రజలను చైతన్యపరిచాం. ఉద్యమం ఒకవైపు.. అమరవీరుల ప్రాణ త్యాగాలు మరోవైపు నిరంతరం కొనసాగింది. అలా అందరి పోరాట ఫలితంగా తెలంగాణ స్వరాష్ట్ర కల నెరవేరింది. అయితే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి.. నిధులొస్తాయి.. నీళ్లొస్తాయి.. మనం గౌరవంగా బతుకొచ్చు అనుకున్నాం. కానీ మనం ఆశించినంత అభివృద్ధి జరగలేదు. ఆంధ్రా పాలకులకు, మన పాలకులను ఎలాంటి వ్యత్యాసం లేదు. వెనుకబడిన  ప్రాంతాలను ముందు వరుసలో ఉంచి అభివృద్ధి చేయడం మరిచిపోయారు. కేవలం రాజకీయం, పలుకుబడి కోసమే పోరాటం చేసిండ్రు. ప్రజలకు మంచి చేయాలి.. ప్రతి సామాజిక వర్గం అభివృద్ధి వైపు అడుగులు వేయాలని  బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) ప్రభుత్వం ఏనాడూ ప్రయత్నం చేయలేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది.   

ఉద్యమ స్ఫూర్తి..

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా ప్రతి గుండెలో కేసీఆర్ నిలిచిపోయిండ్రు. ఆయన మీద ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అన్నిటిని నీరుగార్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎవర్నీ పట్టించుకోలేదు. జేఏసీ చైర్మన్ కోదండరాం నుంచి పోరాటం చేసిన వారిని మర్చిపోయారు. ఉద్యమకారులను మరిచిపోయి.. తెలంగాణ ద్రోహులను అందలం ఎక్కించారు. సొంత రాష్ట్రంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా అన్ని సంఘాలను నిర్వీర్యం చేశాడు. ఈ రాష్ట్రానికి మేమే దిక్కు అన్నట్టుగా రాజరిక పాలనతో వ్యహారించారు. 

సాగు నీరే రాలేదు..

రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమంలోకి రాజకీయం చేసేందుకు వచ్చారు. వారి రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ ఉద్యమంను అడ్డుపెట్టుకున్నారు. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యమంలో భాగస్వాములు అయిండ్రు. ఆనాడు నాలాంటి ఎంతోమంది ప్రయివేట్ ఉద్యోగులు పోరాటం చేసి జైళ్లకు వెళ్లాం. ఎన్నో బాధలు పడ్డాం, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాం. రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయి.. ఉద్యోగాలు వస్తాయి అనే ఆశ గట్టిగా ఉండేది. అందులో మన పాత్ర ఉండాలి మన బాధ్యత అనేలా ఉద్యమంలో పాల్గొన్నాం. ఆనాడు బలమైన నాయకత్వం లేకపోయిన కేసీఆర్‌ను ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిపించిన చరిత్ర పాలమూరుకు దక్కుతుంది.

కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. స్వరాష్ట్రం వచ్చిన వెంటనే మాది ఉద్యమ పార్టీ కాదు పక్కా రాజకీయ పార్టీ అంటు కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అప్పటికి ఉద్యమకారులకు న్యాయం చేస్తారు అనుకున్నాం. కానీ ఏనాడు చేయలేదు. ఉద్యమంలో ఎక్కడకు పోయినా కేసీఆర్‌తో పాటు అందరూ పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్లు కృష్ణనది ప్రవహిస్తుందని చెప్పడం జరిగింది. పది సంవత్సరాల కాలంలో జూరాలలో గతంలో కంటే ఎకరా భూమికి కూడా సాగు పెరగలేదు. పాలమూరు జిల్లాకు పది సంవత్సరాల్లో సాగునీరు దిక్కులేదు. 

కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇవ్వాల్సిన సమయంలో తెలంగాణ రాష్ట్రంను ఇవ్వలేదు. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం మద్దతు తెలియజేసింది. అలా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల సంక్షేమంను పక్కన పెట్టి కేవలం వారికి నచ్చిన విధానంతో పది సంవత్సరాలు పాలించిండ్రు. అవసరం ఉన్నా చోట అభివృద్ధి చేయకుండా.. అవసరం లేని ప్రాంతంలో డబ్బులు ఖర్చు పెట్టారు. తెలంగాణ సమాజాన్ని ఒక కుటుంబంలా చూడకుండా ఎవరికీ న్యాయం చేయలేదు. పది సంవత్సరాలు నిరీక్షణ చేసిన తెలంగాణ సమాజానికి బీఆర్‌ఎస్‌పై అసహనం పెరిగింది. ప్రజలే  ప్రతిపక్షంను వెతుక్కుండ్రు. గతంలో బీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ పార్టీ ఏ తప్పిదం చేసిందో ఆ ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేయకూడదు.

తెలంగాణ అమరవీరుల ఆకాంక్షను నేరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యమకారులందరినీ, అమరవీరులందరికీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలి. ఉత్తర తెలంగాణలో కొందరు ఉద్యమకారులు ఎమ్మెల్యేలుగా ఇతర పదవులు అనుభవించి అభివృద్ధి దిశగా ముందుకు సాగింపోయిండ్రు. ఉద్యమానికి ఊపిరిపోసినోళ్లు నిర్వీర్యం అయిపోయిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెనుకబడిన ప్రాంతాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. విద్య, వైద్య రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. కేవలం పథకాలు పెట్టి ప్రజలకు డబ్బులు పంచిండ్రు. పది సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి గురైన పాలమూరు జిల్లా దక్షిణ తెలంగాణలో ఉద్యమకారులు అణిచివేతకు గురి చేశారు. ఆనాడు జేఏసీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా మా ప్రాంతం నుంచి ఉద్యమకారులు వస్తారు అనుకున్నాం. కానీ మా జీవితంలో ఎలాంటి మార్పూ రాలేదు. 

 జిల్లెల రఘు,

మహబూబ్‌నగర్, విజయక్రాంతి

ప్రొఫెసర్ జయశంకర్ సార్‌తో..

నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ జువాలజీ చదివాను. అప్పటి నుంచే తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయనే భావనతో యూనివర్సిటీ అంత ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్‌తో కలసి ఎన్నో సభల్లో సమావేశాల్లో పాల్గొన్నాం. ఎంత చదివిన ఉద్యోగం రావాలన్నా, నీళ్లు, నిధులు  రావాలంటే స్వరాష్ట్రం తప్పనిసరి అనే నినాదంతో మలి దశ ఉద్యమంలో అందర్నీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి పోరాటం చేశాం. జిల్లా అధికారులుగా బాధ్యతలు నిర్వహించాల్సిన తాము గ్రూప్స్ పరీక్షలను సైతం పక్కన పెట్టి  పాలమూరులోని మల్లికార్జున చౌరస్తా దగ్గర హాల్‌టిక్కెట్లను దహనం చేయడం జరిగింది. ఎలాగైనా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం. అప్పటికే సగం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలస పోయేవారు. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుందంటే ఇక తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గమని గట్టిగ నమ్మి ఉద్యమం మరింత ఉధృతం చేశాం. అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చాం. మా ప్రాంతంలో సాగు నీరు వస్తే బాగుపడుతుందని అందరం కలలు కన్నాం. కానీ మేం ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు. 

నియంతృత్వ పాలన..

తెలంగాణ సమాజం ఆకలిని భరిస్తుంది.. కానీ అణిచివేతను భరించదు. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశాడు. టీఆర్‌ఎస్ పార్టీకి బలం ఉద్యమకారులే అన్న సంగతి మార్చిపోయాడు.  ఆనాడు త్యాగాలు చేసింది ఎవరు? భోగాలు అనుభవిస్తున్నది ఎవరు? ఉద్యమకారులను పక్కన పెట్టి నియంతృత్వ పాలన చేశాడు. అందుకే ఈసారి తెలంగాణ ప్రజల చైతన్యమే కేసీఆర్‌ను ఓడించడం జరిగింది. అభివృద్ధికి ఆత్మగౌవరం ప్రత్యమ్నాయం కాదు అని మరోసారి నిరూపించి చూపించారు తెలంగాణ ప్రజలు. ఆనాడు వైఎస్.రాజశేఖర్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి కూడా ప్రజలు ఇదే విషయాన్ని చెప్పారు. పదేళ్ల పరిపాలన ఫలితమే మనం చూస్తున్నది.