యుద్ధానికి 3 రోజుల విరామం
పోలియో వ్యాక్సినేషన్ కోసం అంగీకరించిన ఇజ్రాయెల్, హమాస్
ఇజ్రాయెల్, ఆగస్టు 30: తొమ్మిది నెలల నుంచి సాగుతోన్న ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. గాజాలో దాడులను 3 రోజుల పాటు నిలిపివేసేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. 6.4 లక్షల మంది చిన్నారులకు తొలిరౌండ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ఇరుపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఇటీవల గాజాలో ఓ చిన్నారిలో పోలియో వైరస్ గుర్తించారు. తను టీకా తీసుకోకపోవడమే కారణమని గుర్తించారు.
25 ఏళ్లలో తొలిసారి ఆ ప్రాంతంలో ఈ కేసు వెలుగుచూడటం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీంతో పోలియో టీకాల పంపిణీ కోసం ఇరువర్గాలు అంగీకరించాయి. ఆదివారం నుంచి టీకా కార్యక్రమం ప్రారంభించనున్నారు. తొలుత సెంట్రల్ గాజా, తర్వాత దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో చిన్నారులకు వ్యాక్సిన్లు వేయనున్నారు. తర్వాత నాలుగు వారాలకు రెండో విడుత టీకా వేయనున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.






