ఆర్టీసీలో 1,743 ఉద్యోగాల ఎంపిక ఫలితాలు విడుదల
- 894మంది డ్రైవర్లు, 710 మంది శ్రామికులు..
- ఫలితాలు విడుదల చేసిన టీజీపీఆర్బీ
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి (టీజీపీఆర్బీ) సోమవారం విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్ 17న మొత్తం 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా మొత్తం 1,604 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు వెల్లడించింది.
వెయ్యి డ్రైవర్ పోస్టులకు 894మంది ఎంపిక కాగా, 743 శ్రామిక్ పోస్టులకు 710 మంది ఎంపికయ్యారు. డ్రైవర్ పోస్టుకు సంబంధించి న డ్రైవింగ్ టెస్ట్ మార్కుల షీట్లు అభ్యర్థుల లాగిన్‌లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొం ది. సెలక్షన్ జాబితాలు, అన్ని కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. తుది నియామకం అభ్యర్థుల ప్రవర్తన, వెరిఫికేషన్, వైద్య పరీక్షల్లో అర్హత సాధించడంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
ఈనెల 7న ఉదయం 8 గంటల నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు డిజిటల్ రూపంలో అటెస్టేషన్ ఫారం నింపాల్సి ఉంటుందని సూచించింది. ఈనెల 17న మూడు కాపీల అటెస్టేషన్ ఫారాలు, సంబంధిత ధ్రువపత్రాలను ఆయా పోలీస్ జిల్లా, కమిషనరేట్ కార్యాలయాల్లో సమర్పించాలని పేర్కొన్నది.






